16-20th Lentdays2020



బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం 
16thసిలువ శ్రమల ధ్యానకూటములు 
వాక్యపరిచర్య Shri V.అబ్రాహాము గారు
మార్కు 10:17-22
అంశం: నిత్యజీవము

చదవబడిన వాక్యంలో మనం చుస్తే యేసుప్రభువారు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒక యవ్వనస్తుడు పరుగెత్తికొనివచ్చి ఆయన యెదుట మోకాళ్లూని సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగినట్లుగా మనం చూస్తాం.

ఈలోకంలో మూడురకములైన మానవులు సాధారణంగా మనకు కనిపిస్తారు.
**ఆస్తికులు అనగా దేవుడు ఉన్నాడు అని నమ్మేటటువంటివారు.
**నాస్తికులు అనగా దేవుడు ఎవరు లేరు అని చెప్పేవారు.
**మానవతావాదులు దేవుడు ఉన్న లేకపోయినా మన పని మనం చేసుకొని పోవాలి అని అనుకొనేవారు.

ఈరోజున ఎన్నో భక్తి కార్యములు చేసిన దానధర్మములు చేసిన దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే నిత్యజీవము పొందుకోవడానికే. 

ఈరోజున మనం తెలుసుకోవలసినది నిత్యజీవము కావాలి అని అంటే మనం చేయాలి? బైబిల్ గ్రంధములో ఈ నిత్యజీవము పొందుటకు యేసుప్రభువారు ఏమిచెప్తున్నారు అని మనం ధ్యానించుకొందాం.  

1.మొదటిగా యేసుప్రభువారు నిత్యజీవము పొందుకోవాలి అని అంటే ఏమి చేయమని చెప్పారు. 

వాక్యంలో ఈ యవ్వనస్తుడు యేసుప్రభువారి ఎదుట మోకాళ్లూని ఆయనను అడిగినప్పుడు నరహత్య చేయవద్దు, వ్యభిచ రింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధసాక్ష్యము పలుకవద్దు, మోస పుచ్చవద్దు, నీ తలిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియును గదా అని అతనితో చెప్పెను.అందుకతడు బోధకుడా, బాల్యమునుండి ఇవన్నియు అనుస రించుచునే యుంటినని చెప్పెను.

ఇక్కడవాక్యంలో మనం గమనిస్తే యేసుప్రభువారు ఆ యువకుడిని చూచి అతని ప్రేమించి నీకు ఒకటి కొదువగానున్నది; నీవు వెళ్లి నీకు కలిగినవన్నియు బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. అతడు మిగుల ఆస్తిగలవాడు, గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని, దుఃఖపడుచు వెళ్లిపోయెను. అప్పుడు యేసు చుట్టు చూచిఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యు లతో చెప్పెను.

ఈరోజున మనం దేవుని బిడ్డలుగా నిత్యజీవము పొందుకొనుటకు ఏదోఒకటి కొరత ఉన్నదా? మనలను మనం పరీక్షించుకొని ఆ కొదువ ఏమిటో తెలుసుకొని మనలను మనం సరిచేసుకొని అది ఏమైనప్పటికి సరిచేసికొంటే మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది.

2.అసలు నిత్యజీవము అంటే ఏమిటి దాని ప్రాముఖ్యత ఏమిటి అని దేవుని వాక్యంలో మనం చుస్తే 

క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.
యోహాను సువార్త 17:3 అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.

కుమారునియందు విశ్వాసముటయే నిత్యజీవము
యోహాను సువార్త3:36 కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును.

నన్ను పంపినవానియందు విశ్వాసముటయే నిత్య జీవము
యోహాను సువార్త5:24 నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు;

3.ఈరోజున మనం దేని కొరకు పరిగెడుచున్నాము బైబిల్ గ్రంధములో పరిగెడుచున్న మరియొక వ్యక్తిని గూర్చి మనం ఆలోచిస్తే ఎలీషా శిష్యుడైన గేహజీ సిరియనుడైన నయమాను ధనము కొరకు ఆశపడి నాశనము తెచ్చుకున్న సందర్భమును మనం జ్ఞాపకం చేసుకొంటే

2రాజులు 5:20 అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గేహజీ సిరియనుడైన యీ నయమాను తీసికొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెను గాని, యెహోవా జీవముతోడు నేను పరుగెత్తికొని పోయి అతని కలిసికొని అతనియొద్ద ఏదైనను తీసికొందు ననుకొని
21 నయమానును కలిసికొనుటకై పోవుచుండగా, నయమాను తన వెనుకనుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథముమీదనుండి దిగి వానిని ఎదుర్కొనిక్షేమమా అని అడిగెను. అతడుక్షేమమే అని చెప్పి నా యజమానుడు నాచేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నాయొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారికొరకు రెండు మణుగుల వెండియు రెండు దుస్తుల బట్టలును దయ చేయుమని సెలవిచ్చుచున్నాడనెను.
23 అందుకు నయమానునీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసికొనుమని బతిమాలి, రెండు సంచులలో నాలుగు మణుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలనిచ్చి, తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గేహజీ ముందర వాటిని మోసికొని పోయిరి.
24 ​మెట్లదగ్గరకు వారు రాగానే వారి యొద్దనుండి గేహజీ వాటిని తీసికొని యింటిలో దాచి వారికి సెలవియ్యగా వారు వెళ్లిపోయిరి.
25 ​అతడు లోపలికి పోయి తన యజమానుని ముందరనిలువగా ఎలీషా వానిని చూచి గేహజీ, నీవెచ్చటనుండి వచ్చితివని అడిగి నందుకు వాడునీ దాసుడనైన నేను ఎచ్చటికిని పోలే దనెను.
26 ​అంతట ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతోకూడ రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవచెట్ల తోటలను ద్రాక్షతోటలను గొఱ్ఱలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా?
27 ​కాబట్టి నయమానునకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచువలె తెల్లనైన కుష్ఠము గలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్లెను.

చివరికి ఎలీషా శిష్యుడైన గేహజీ నయమాను దనమునకు ఆశపడి అతని కుష్ఠము అనే నాశనమును తెచ్చుకొన్నాడు కాబట్టి ప్రియులారా మనం ఈరోజున దేనికొరకు పరుగెడుచున్నాము ధనము కొరకా నాశనము కొరకా మనం ఆలోచించుకోవాలి.

4.బైబిల్ గ్రంధములో తనకున్న ఆస్తిని విడిచిపెట్టి రక్షణను పొందుకున్న వ్యక్తి జక్కయ్యను గూర్చి మనం జ్ఞాపకం చేసుకొంటే

లూకా సువార్త 19:1ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవే శించి
2 దానిగుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు
3 యేసు ఎవరోయని చూడగోరెనుగాని, పొట్టి వాడైనందున జనులు గుంపుకూడి యుండుట వలన చూడ లేకపోయెను.
4 అప్పుడు యేసు ఆ త్రోవను రానై యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి, ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను.
5 యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, కన్నులెత్తి చూచిజక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ యింట నుండవలసియున్నదని అతనితో చెప్పగా
6 అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను.
7 అందరు అది చూచి ఈయన పాపియైన మనుష్యునియొద్ద బసచేయ వెళ్లెనని చాల సణుగుకొనిరి.
8 జక్కయ్య నిలువబడిఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవనియొద్ద నైనను అన్యాయముగా దేనినైనను తీసికొనినయెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను.
9 అందుకు యేసుఇతడును అబ్రాహాము కుమారుడే; ఎందుకనగా నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది.

జక్కయ్య యేసుప్రభువారిని చూచిన తరువాత అతనిలో కలిగిన మార్పు ఈరోజున మనలో కూడా రావాలి. మనం దేవుని వాక్యమును విని తద్వారా మన జీవితంలో ఎటువంటి లోపాలు ఉన్న సరిచేసుకొని యేసుప్రభవువారు ఇచ్చే నిత్యజీవమును పొందుకొను వారీగా మనం ఉండాలి అట్టి కృప మన అందరికి కలుగును గాక ఆమెన్

యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్..
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.. 

************************************************

బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
17thసిలువ శ్రమల ధ్యానకూటములు
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు
యోహాను సువార్త 5:1-15
Topic:యేసు బేతెస్థ కోనేరు వద్ద రోగిని స్వస్థపరచుట



చదవబడిన వాక్యంలో మనం చుస్తే యూదుల పండుగ యొకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్లెను.ఈ యెరూషలేము పట్టణమును గూర్చి మనం ఆలోచన చేస్తే., దేవుని ఆశీర్వదకరకంగా కట్టబడిన కట్టడం. ఈ యెరూషలేము పట్టణం చేరాలి అని అంటే పనెండ్రుగుమ్మములు ఉన్నాయి., వాటిని దాటుకొని లోపలి రావాలి  ఈ యెరూషలేము గొఱ్ఱెల ద్వారము వద్ద ఒక చిన్న కోనేరు ఉన్నది హెబ్రీ భాషలో దాని పేరు బేతెస్ద. ఇక్కడ ఐదు మండపములు కలవు. ఈ గొఱ్ఱెల ద్వారముల వద్ద గొఱ్ఱెల అమ్మకం కొనడం జరుగుతుంది. ప్రత్యేకించి ఎందుకు అని అంటే వారి వారి పాపముల ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వాటిని అక్కడ విక్రయించేవారు. ఈ ద్వారం దగ్గర అనేక మంది వ్యాధిగ్రస్తులు ఉండేవారు., ఆ కోనేరు దగ్గర అనేకమంది రోగులు పడిఉండేవారు ఎందుకు అని అంటే వారి వారి రోగములనుండి స్వస్తతల కొరకు.

మానవుల యొక్క పాపముల నుండి ప్రాయశ్చిత్తం చేస్తుంది ఈ గొఱ్ఱెలద్వారం మార్గం ఐతే, ఈ కోనేరు మానవులకి రోగముల నుండి స్వస్థత ఇచ్చేదిగా ఉన్నది. ఎందుకు అని అంటే ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట, మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగలవాడైనను బాగు పడును.

1.ఈ స్వస్థత కావాలి అని అంటే మొదటిగా మనం తెలుసుకోవలసినది వారు కనిపెట్టువారిగా ఉండాలి.

ఆ దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలింపబడినప్పుడు ఆ సమయం కొరకు వారు కనిపెట్టువారిగా ఉండాలి, అప్పుడే ఎవరైతే మొదటిగా దిగునో వారికే వారి యొక్క రోగములు నుండి స్వస్థత కలుగుతుంది ఈ కనిపెట్టుట అనేదే వారు చేసే మొదటి ప్రక్రియ.

2.దేవుని బిడ్డలుగా మనం దేని కొరకు కనిపెట్టాలి అని మనం ఆలోచిస్తే

మన జీవితంలో దేవుని రాకడ కొరకు కనిపెట్టుట అనేది దేవుని బిడ్డల లక్షణం
ఒక కాపరి ఉదయం కొరకు ఎలాగున కనిపెట్టునో మనం కూడా ఆశతో దేవుని రాజ్యం కొరకు దేవుడు ఇచ్చే రక్షణ కొరకు కనిపెట్టువారిగా మనం ఉండాలి రోగులైన వారు స్వస్థత కొరకు కనిపెట్టుచున్నారు, మనం మన రక్షణ కొరకు యేసయ్య రాకడ కొరకు కనిపెట్టువారిగా మనం ఉండాలి.

3.రెండవదిగా 38సంవత్సరముల నుండి వ్యాధితో బాధపడుచున్న ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని మనం ఆలోచిస్తే

అది చాల దయనీయమైన పరిస్థితి, అతడు లేవలేని పరిస్థితి, అతనికి ఎవరు సహాయం చేయలేని పరిస్థితి అటువంటి వ్యక్తి దగ్గరకు యేసయ్య వచ్చి నీవు స్వస్థపరచగోరుచున్నావా అని అడిగినట్లుగా మనం చూస్తాం అప్పుడు ఆ రోగి అయ్యా, నీళ్లు కదలింపబడి నప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరియొకడు నాకంటె ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను.
యేసయ్య నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తికొని నడిచెను

4.ఈరోజున మన జీవితం ఎలా ఉన్నది, మన ఆధ్యాత్మిక పరిస్థితి ఏవిధంగా ఉంది అని మనం ఆలోచిస్తే

ఈరోజున మనం శారీరక స్వస్థతల కొరకు మనం మొరపెట్టుచున్నాము, పొందుకొనుచున్నాముకానీ మన ఆత్మీయ స్వస్థత కొరకు మనం సిద్దపడటం లేదు. ఆ రోగికి స్వస్థత రావాలి అని అంటే ఆ కోనేరులో దేవదూతచే నీళ్లు కదిలింబడినప్పుడు దిగాలి, ఆదివిధంగా మన ఆత్మీయ స్వస్థత కొరకు గొఱ్ఱెపిల్ల రక్తములో మన పాపములను ఉతుకు కొని తెలుపుగా చేసుకోను వారీగా మనము ఉండాలి ఈ రోజున మనం రక్షణ పొందుకోవడానికి వెనుకంజవేయరాదు. మారు మనస్సు కలిగి దేవుని రాజ్యం కొరకు కనిపెట్టాలి, ఆ దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలి అట్టి కృప మన అందరికి కలుగును గాక ఆమెన్.

యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

*************************************************************



బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
18thసిలువ శ్రమల ధ్యానకూటములు
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు
 
Topic:యేసు ఊచ చెయ్యిగలవానిని బాగుచేయుట
లూకా సువార్త 6:6-11., 10 వారినందరిని చుట్టు కలయజూచినీ చెయ్యి చాపుమని వానితో చెప్పెను; వాడాలాగు చేయగానే వాని చెయ్యి బాగుపడెను.

1.మొదటిగా ఈ ఊచ చెయ్యి అనే వ్యాధి ఎలా ఉంటుంది అని అంటే
ఊచ చెయ్యికి బలం అనేది ఉండదు, చెయ్యి ఎటువంటి పని చెయ్యలేదు, ఒక మనిషిలో ప్రతి అవవయవంలో నరములు అనేవి చాల ప్రాముఖ్యమైనవి., ఇవి మానవుని శరీరంలో ప్రతిభాగానికి రక్తమును సరఫరా చేస్తాయి, నరములనుండి రక్తప్రసరణ అనేది సరిగా లేకపోతె అవయవమనేది పనిచేయదు వాక్యంలో ఊచ చెయ్యి గలవాని పరిస్థితి కూడా అదే.

2.రెండవదిగా యేసుప్రభువారు ఊచ కుడి చెయ్యిగల వానిని బాగుచేసిన సందర్బమును మనం గమనిస్తే
 
యేసుప్రభువారు విశ్రాంతిదినమున సమాజమందిరము లోనికి వెళ్లి బోధించుచున్నప్పుడు, అక్కడ ఊచ కుడి చెయ్యిగల ఒక వ్యక్తిని అతని పరిస్థితిని చూసి అతనిని యేసయ్య బాగుచేసినట్లుగా మనం చూస్తాంఇక్కడ ఉన్న సందర్భము ఏమిటి అని అంటే అది విశ్రాంతిదినము, ఆరోజున ఎవరు పని చేయకూడదు సమయంలో యేసుప్రభువారు సమాజమందిరంలో ఉన్న శాస్త్రులు వారి హృదయాలోచను ఎరిగి వారు ఆయనలో ఏదో ఒక తప్పును పట్టుకోవాలని చూస్తున్నారని ఎరిగి వారి నుద్దేశించి విశ్రాంతిదినమున మేలుచేయుట ధర్మమా కీడుచేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా ప్రాణ హత్య ధర్మమా? అని మిమ్ము ఆడుగుచున్నానని వారిని ప్రశ్నించినట్లుగా మనం చూస్తాం. అంతే కాకుండా విశ్రాంతిదినమున ఒక గొఱ్ఱె పడిపోతే రక్షించామా అని వారిని ప్రశ్నించినట్లుగా మనం గమనించవచ్చు .అటువంటి వ్యక్తిని అతని పరిస్థితిని చూసి అతనిని యేసయ్య బాగుచేసినట్లుగా మనం చూస్తాం.

3.మూడవదిగా యేసుప్రభువారు ఇచ్చిన స్వస్థతలను గూర్చి మనం ఆలోచన చేస్తే
 
యేసుప్రభువారి ఆలోచన ఎవరిని గూర్చి అని ఆంటే అయన ఎల్లప్పుడును దీనులైన వారిని గూర్చే బీదలైనవారిని గూర్చే ఆలోచిస్తున్నారు . అప్పుడు యేసుప్రభువారు వారినందరిని చుట్టు కలయజూచి నీ చెయ్యి చాపుమని వానితో చెప్పెను; వాడాలాగు చేయగానే వాని చెయ్యి బాగుపడెను. అనేకులు అయన నోటి మాట ద్వారా స్వస్తత పొందినవారు కొందరైతే, రోగులైన వారిని తీసుకువచ్చిన వారి విశ్వాసం బట్టి  స్వస్తత పొందినవారు ఇంకొందరు, అయన వస్త్రపు చెంగులో స్వస్థత కలిగినవారు , అయన చేతులద్వారా, అయన నోటి ఉమ్మి ద్వారా కూడా స్వస్థతపొందినవారు మరికొందరు. ఇలా అనేక మందికి అనేక విధాలుగా అయన స్వస్థత ఇచ్చినట్లుగా మనకు తెలుసు .

4.నాల్గవదిగా మన జీవితంలో ఊచ చెయ్యి అనేది దేనికి సూచనగా ఉన్నది అని మనం ఆలోచిస్తే

మన జీవితంలో దేవుని బిడ్డలుగా మనం దేవుని పనికి ఉపయోగపడని చెయ్యి ., ఊచ చెయ్యి కి సూచనగా ఉన్నది.
మన చేతులు దేవుని ఉపయోగపడాలి, సహాయం కోరినవారికి ఉపయోగపడాలి, దేవునికి ఇచ్చే చేతులుగా మన రెండు చేతులు ఉండాలి. అప్పుడే అయన మనలను ఆశీర్వదిస్తారు. మన జీవితంలో మన చేతులు దేవుని కొరకు పనికొచ్చే చేతులుగా ఉండాలి కానీ వెనకకు తీసే చేతులుగా ఉండరాదు.,  ఆలాగున ఉంటె మన చేతులు దేవుని దృష్టికి ఊచ చెయ్యిగలవానితో సమానం అని పోలికగా యేసయ్య ఈరోజున మనతో చెప్తున్నారు.

దైవజనుని మాట వినకపోయినందున రాజైన యరొబాము చాపిన చెయ్యి యెండి పోయిన ఒక సందర్భమును మనం జ్ఞాపకం చేసుకొంటే


2రాజులు 13:1-7 దైవజనుడు యెహోవా ఆజ్ఞచేత బలిపీఠమునకు మాట ప్రక టనచేసెనుబలిపీఠమా బలి పీఠమా, యెహోవా సెలవిచ్చునదేమనగా దావీదు సంత తిలో యోషీయా అను నొక శిశువు పుట్టును; నీమీద ధూపము వేసిన ఉన్నత స్థలముయొక్క యాజకులను అతడు నీమీద అర్పించును; అతడు మనుష్య శల్యములను నీమీద దహనము చేయును. బలిపీఠము బద్దలై పోయి దానిమీదనున్న బుగ్గి ఒలికి పోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి దినమున ప్రవక్త సూచన యొకటి యిచ్చెను. బేతేలునందున్న బలి పీఠమునుగూర్చి దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని, బలిపీఠముమీదనుండి తన చెయ్యి చాపి, వానిని పట్టు కొనుమని చెప్పగా అతడు చాపిన చెయ్యి యెండి పోయెను; దానిని వెనుకకు తీసికొనుటకు అతనికి శక్తిలేక పోయెను. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచనచొప్పున బలిపీఠము బద్దలుకాగా బుగ్గి దానిమీదనుండి ఒలికిపోయెను. దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని, బలిపీఠముమీదనుండి తన చెయ్యి చాపి, వానిని పట్టు కొనుమని చెప్పగా అతడు చాపిన చెయ్యి యెండి పోయెను.

చివరికి మరల రాజైనయరొబాము నా చెయ్యి మునుపటివలె బాగగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నాకొరకు వేడుకొనుమని దైవజనుని బతిమాలుకొనగా, దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను గనుక రాజు చెయ్యి మరల బాగై మును పటివలె ఆయెను.

సందర్భమును మనం గమనిస్తే మన చేయి దేవుని ఇచ్చే చెయ్యిగా ఉండాలి, దేవుని సేవకులకు ఇచ్చే చెయ్యిగా ఉండాలి, కానీ దేవుని పనికి వ్యతిరేకముగా చేసే చెయ్యిగా ఉండరాదు., ఉంటె రాజుకు వచ్చినస్థితి వారికీ వస్తుంది. అందుకే మన చేతులు దేవుని పనికి ఉపయోగపడేచేతులుగా ఉండాలి.

మరియొక దేవుని వాక్యమును మనం గమనిస్తే ఇది దేవుని సేవకులైన వారికీ ఇస్తున్న హెచ్చరిక

జెకర్యా 11:17 మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ; అతని చెయ్యియు కుడికన్నును తెగవేయబడును; అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును అతని కుడికంటికి దృష్టి బొత్తిగా తప్పును.

ఇక్కడ మంద అనగా సంఘము, దేవుని సంఘమును కాపాడే భాద్యతను ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటె వారికీ శ్రమ అని దేవుని వాక్యం చెప్తుంది. అటువంటి వారి చెయ్యి ఎండిపోవును, కృంగిపోవును, పడిపోవును. ఎప్పుడు అని ఆంటే దేవుడు ఇచ్చిన మందను కాపాడే భాద్యతను నిర్లక్ష్యపరిస్.,తే ఐతే మన దేవుడు మనలను విడిచిపెట్టే దేవుడు కాదు అయన తన గాయపడిన చేతులతో మనలను పిలుస్తూనే వుంటారు అందుకే మన చేతులు దేవునిని చేసే చేతులుగా, దేవుని స్తుతించే చేతులుగా, ఇతరులకు సహాయం చేసే చేతులుగా ఉండాలి, అప్పుడే దేవుని కుడిహస్తం అయన దక్షిణ హస్తం ఎల్లప్పుడును పడిపోయిన వారిని, కృంగిపోయిన వారిని మనలను నిత్యం కాపాడే హస్తం అయన శక్తిగల హస్తం.

5.ఐదవదిగా అటువంటి దేవుని హస్తము క్రింద మనం ఎలాగూ ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది అని ఆంటే

1 పేతురు 5:6 దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి.

అయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై ఉండాలి మనలో నిర్లక్ష్య స్వభావంగాని, గర్వించే స్వభావంగాని ఉండరాదు., అప్పుడే చేతులు మనలను ఉన్నత శిఖరము వైపు మనలను నడిపిస్తాయి. ఆలాగున ఉండాలి అని ఆంటే మనం దీనమనసు కలిగి యేసయ్య చేతులక్రింద ఉండాలి.
 
మనం ప్రార్ధన ద్వారా, వాక్యం ద్వారా, అయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడే మనం అయన  ఇచ్చు గొప్ప ఆశీర్వాదమును అయన చేతుల ద్వారా పొందుకుంటాం ఆమెన్.

యేసయ్య ఈమాటలను దీవించును గాక ఆమెన్..

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్..

***************************************************



బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
19thసిలువ శ్రమల ధ్యానకూటములు
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు
Topic: జక్కయ్య - రక్షణ

లూకా సువార్త 19:1-10 ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవే శించి
2 దానిగుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు.

జక్కయ్య అనుమాటకు పవిత్రుడు అని అర్ధం, కానీ అతని జీవితమును మనం చుస్తే అపవిత్రంగానే ఉంది. అయన పేరుకు తగిన పవిత్రమైన విధంగా అయన జీవితం లేదు , పరిశుద్ధగ్రంధము ఏమి చెప్తుంది అని అంటే మనం నీతి కలిగి జీవించాలి, న్యాయముగా ఉండాలి న్యాయమైన తీర్పు తీర్చేవారిగా మనం ఉండాలి అని చెప్తుంది. అందుకు బిన్నంగా ఈ జక్కయ్య అనే వ్యక్తి వ్యవహరిస్తున్నాడు. ఈ వ్యక్తి జక్కయ్య సుంకపు గుత్తదారుడుగా తన పనిలో ఆనతి రోమా ప్రభుత్వంలో ఉద్యోగిగా పనిచేసేవాడు. ఈ జక్కయ్య అన్యాయముగా పన్నులు వసూలు చేసేవాడు.

1.ఈరోజున మన జీవితం ఏలాగున ఉన్నది, పవిత్రంగా జీవిస్తున్నామా లేదా అపవిత్రంగా జీవిస్తున్నామా  

మన జీవితంలో ఇతరులకు అన్యాయము చేసేవారిగా ఉంటున్నామా, మన జీవితం ఎలా ఉన్నది అని మనం ఆలోచిస్తే ., ఈ జక్కయ్య జీవితం నుండి క్రైస్తవులైన వారు ఏమి నేర్చుకోవాలి అని మనం ఆలోచిస్తే., మనం మన జీవితంలో నీతి కలిగి ఉండాలి. దేవుడిచ్చినదానితో తృప్తికలిగి జీవించాలి, దేవుని బిడ్డలుగా మనమందరం పవిత్రులమే, ఎందుకు అని అంటే మన యేసయ్య తన స్వరక్తమిచ్చి మనలను పవిత్రులుగా చేసారు కనుక మన జీవితం అపవిత్రంగా ఉండరాదు.

2.ఇక్కడ వాక్యంలో ఈ జక్కయ్య పరిస్థితి ఎలా ఉన్నది అని మనం ఆలోచిస్తే

ఈ సుంకరుడైన ఈ వ్యక్తిని శాస్త్రులు, పరిసయ్యలు ఒక పాపిగానే చూస్తున్నారు ఎందుకు అని అంటే అతని యొక్క వృత్తినిబట్టి.
ఇలాంటి వ్యక్తి యేసుప్రభువారిని గూర్చి విన్నాడు, యేసయ్య చేసిన ఆశ్చర్య, అద్భుత కార్యములను గూర్చి తెలుసుకొని ఆ రోజున అతడు తన యొక్క గ్రామంలోని వచ్చినపుడు ఎలాగైనా యేసయ్యను చూడాలి అని ఆశకలిగి అక్కడ ఉన్న మేడి చెట్టెక్కి ఆయనను చూడాలి అని అనుకున్నాడు, ఇక్కడ అయన యేసయ్యను చూడాలి అని అతని కోరికలో, మనకు అయన  పట్టుదల మనకు కనిపిస్తుంది.

3.ఈ జక్కయ్య నుండి మనం నేర్చుకోవలసినది ఏమి అని అంటే 

మనం కూడా మన యేసయ్య పట్ల అటువంటి ఆశ కలిగివుండాలి, ఇక్కడ ప్రభువును చూడాలి అనే కోరిక అతనిలో సహనమును,అయన కున్న పట్టుదల మనకు కనిపిస్తుంది
అందుకే దావీదు పలికిన దేవుని వాక్యం చెప్తుంది కీర్తనల గ్రంథము 42:1 దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.

అటువంటి ఆశక్తి మన యేసయ్య పట్ల మనం నిత్యం కలిగి ఉండాలి., నేను ఎప్పుడు ఆయన సన్నిధికి వెళ్లెదను, నేనెప్పుడూ అయన సన్నిధిలో కనపడేదనా అని అయన కొరకు కనిపెట్టువారిగా మన ఉండాలి, దేవుని మహిమను, దేవుని ప్రసన్నతను చూడాలి అని ఆశ కలిగి మనం ఉండాలి.

4.ఇక్కడ జక్కయ్య హృదయం ఎలా ఉన్నది అని మనం గమనిస్తే  
   
అతని హృదయంలో దేవుని చూడాలి అని ఆశ, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, కన్నులెత్తి చూచిజక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ యింట నుండవలసియున్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. హృదయాంతరములను ఎరిగినదేవుడు మన యేసయ్య. మనం దేవుని ఎంతగా ప్రేమిస్తున్నామో అయన గమనించి ఈ జక్కయ్యను పిలిచినట్లుగా మనం చూస్తాం. యేసయ్య ప్రేమ గొప్పది ఎoదుకు అని అంటే ఒక పాపిని కూడా ప్రేమించే ప్రేమ ఆయనది.   అందరు అది చూచి ఈయన పాపియైన మనుష్యునియొద్ద బసచేయ వెళ్లెనని చాల సణుగుకొనిరి. జక్కయ్య నిలువబడిఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవనియొద్ద నైనను అన్యాయముగా దేనినైనను తీసికొనినయెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను అతనిలో మారుమనస్సు కలిగింది, అతడు జీవితంలో యేసయ్యవచ్చినపుడు  అతడు చేసిన పాపములు  ఒప్పుకొని  తన జీవితమును  మార్చుకున్నాడు  తాను అక్రమముగా  సంపాదించిన దానిని తిరిగి బీదలకు ఇస్తానని చెప్పాడు.  అందుకే దేవుని వాక్యం చెప్తుంది అతిక్రమములను  దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని చెప్తుంది., అందుకే యితడు తన తప్పులను  యేసయ్య ముందు ఒప్పుకొని తన జీవితమును మార్చుకున్నాడు. 

5.ఎందుకు యేసయ్య ఇతడును అబ్రాహాము కుమారుడే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని అన్నారు అని మనం ఆలోచిస్తే 


అందుకు యేసు ఇతడును అబ్రాహాము కుమారుడే; ఎందుకనగా నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది. నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. అతనికున్న ఆశను బట్టి, అతడు దేవుని చూడాలి అని అతనికున్న పట్టుదలను బట్టి తన పాపములను ఒప్పుకొన్న విధానమును బట్టి ప్రభువు ఆ మాటను పలికినట్లుగా మనం చూస్తాం. జక్కయ్య ఎప్పుడైతే యేసును చేర్చుకున్నాడో అతడు మార్చబడ్డాడు , యేసయ్య పట్ల మనం కూడా అటువంటి ప్రేమ కలిగి ఉండాలి.

యేసయ్య ఈ జక్కయ్యను  అబ్రాహాముతో ఎందుకు సంభోదించారు అని అంటే 
అబ్రాహాము  విశ్వాసులకు తండ్రి దేవుడు ఎక్కడకు వెళ్ళమని అని అంటే అక్కడకి వెళ్ళాడు.  అటువంటి విశ్వాసం కలిగినవాడు., అబ్రాహాము సమస్తమును విడిచిపెట్టి  ప్రభువును  వెంబడించాడు. అటువంటి వ్యక్తిత్వం ఈ జక్కయ్యలో మనకు కనిపిస్తుంది కాబట్టి ఆయనను అబ్రాహాము కుమారునితో యేసుప్రభువారు పోల్చారు.  

ఈరోజున మనం జక్కయ్యలో దేవుని చూడాలి ఆని ఆయనకున్నఆశక్తి, దేవుని పట్ల ఆయనకున్న గొప్ప ప్రేమ, దేవుని యందు ఆయనకున్న విశ్వాసం మనo కలిగి జీవించే కృపను మన అందరికి కలుగ జేయాలని ఆశిస్తూ..

యేసయ్య ఈ మాటలను దీవించునుగాక

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
***********************************************************


బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
20thసిలువ శ్రమల ధ్యానకూటములు
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు
Topic: యెరికో సువాసనగల పట్టణం

మార్కు సువార్త 10:46-52
49 అప్పుడు యేసు నిలిచివానిని పిలువుడని చెప్పగా వారా గ్రుడ్డివానిని పిలిచిధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచు చున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి.

ఇక్కడ చదవబడిన వాక్యభాగములో ఒక పురాతనమైన ప్రాచీనమైన, ప్రసిద్ధిచెందిన, యెరికో పట్టణమును గూర్చి వ్రాయబడినది, ఈ పట్టణం ప్రాముఖ్యతను గూర్చి మనం ఆలోచిస్తే అహాబురాజు ఈ పట్టణమును అభివృద్ధి చేసినట్లుగా చరిత్ర మనకు చెప్తుంది,
యెరికో అనగా సువాసనగల పట్టణం అని అర్ధం,  ఈ యెరికో పట్టణములో మనం చుస్తే భయంకరమైన విగ్రహారాధన కలిగినది. ఒక చిన్న కొండ చుట్టూ కట్టబడినది  గోడలు సుమారుగా ఏడు నుండి ఎనిమిది అడుగుల  వెడల్పు కలిగినది. అంతేకాకుండా ఈ యెరికో పట్టణమును ఈతచెట్ల పట్టణం అని కూడా పిలుస్తారు. ఎందుకు అని అంటే అక్కడ ఖజ్జురపు చెట్లు ఎక్కువగా ఉన్నందువల్లే. 

1.ఇశ్రాయేలీయుల ప్రజలు ఆ యెరికో పట్టణమును ఏవిధంగా నాశనం చేసారు అని
మనం చుస్తే

ఇశ్రాయేలీయులు ఈ పట్టణమును స్వాధీనపరచుకుంటేనే వారు దేవుడు వాగ్దానము చేసిన పాలుతేనెలు కురిసే కానను దేశమును చేరగలరు. అందుకే మోషే కాలేబును, యెహోషువను ఆ పట్టణ రాజగృహం ఎలాఉన్నది అని వేగుచూడటానికి ఆ పట్టణము ప్రాకారమును పరిశీలన చేయడానికి వెళ్లినట్లుగా మనం చూస్తాం. వెళ్లి అక్కడ రాహాబు అనే వేశ్య సహకారంతో అక్కడ ఉండినట్లుగా మనం చూస్తాం. ఈ రాహాబు వారికీ ఎందుకు సహాయం చేసింది అని అంటే వేరు దేవుని బిడ్డలుగా గుర్తించి వారు ఎలాగైనా ఈ పట్ణణమును స్వాధీనపరచుకుంటారు అని వారు స్వాధీన పరచుకున్నతరువాత తన కుటుంబాన్ని రక్షిస్తారు అని వారి యొద్ద వాగ్దానమును తీసుకొని ఆవిధంగా చేసినట్లుగా మనం చూస్తాం.
 
ఇశ్రాయేలీయుల ప్రజలు ఆ పట్టణమును చుట్టిముట్టినపుడు వారు ఈ పట్టణమును స్వాధీనపరచుకోవాలి అని అంటే అది కేవలం దేవుని శక్తి వల్లే అవుతుంది. అని అక్కడ తెల్లని వస్త్రములు ధరించిన యాజకులైన వారు దేవుని స్తుతించినపుడు ఆకాశంలో ఒక మెరుపు
వచ్చి ఆ పట్టణమును నాశనం చేసినట్లుగా, ఎత్తైన ప్రాకారము కృంగిపోయినట్లుగా వారు చేయగలిగారు ఆవిధంగా జరిగింది అని అంటే అది కేవలం వారు దేవుని స్తుతించడం వల్లనే అక్కడ దేవుని శక్తి పనిచేసింది.

2.ఇక్కడ సందర్భమును బట్టి మనం ఏమి నేర్చుకోవాలి అని అంటే
వారు ఎలాగైతే దేవుని శక్తి ద్వారా విజయాన్ని పొందుకున్నారో మనం కూడా నిత్యం దేవుని స్తుతించడం నేర్చుకోవాలి, అప్పుడే మనలో సాతాను నుండి విడిపించబడతాము దేవుని శక్తి పొందుకుంటాము. ఆ శాపగ్రస్తమైన పట్టణం నుండి ఎవరైనా ఏమైనా తీసుకొని వస్తే వారు కూడా శాపగ్రస్తమవుతారు అని ఇశ్రాయేలీయులు అనుకున్నారు. కానీ ఆకాను అనేవాడు వారి బంగారమును తన వెంటతీసుకొని వెళ్లి వెళ్లడం వాళ్ళ తాను కూడా శపించబడ్డాడు., ఎందుకు అని అంటే ఆ పట్టణం శాపగ్రస్తమైనది.

3.కొత్త నిబంధన గ్రంధములో ఈ పట్టణమును గూర్చి మనం చుస్తే

జక్కయ్య ఈ పట్టణపువాడె, జక్కయ్య అనగా పవిత్రుడు అని అర్ధం. కానీ అతని జీవితం అందుకు భిన్నముగా ఉన్నది తరువాత యేసు ప్రభువారిని తన ఇంట చేర్చుకొనుట ద్వారా తన జీవితంలో రక్షణ పొందుకున్నాడు.

అంతేకాకుండా తీమయి కుమారుడగు బర్తిమయియను గ్రుడ్డి భిక్షకుడు త్రోవప్రక్కను ఈ యెరికో పట్టణమువాడే

ఇతని గూర్చి మనం చుస్తే యేసుప్రభువారు ఈ యెరికో పట్టణమునకు వచ్చినపుడు ఈయన నజరేయుడైన యేసు దావీదు కుమారుడా నన్నుకరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టినపుడు అందుకు యేసు నీవు వెళ్లుము; నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయనవెంట చూపుపొంది వెళ్లెను.

4.ఈ యెరికో పట్టణం సువాసనగల పట్టణంగా ఎలా మారింది అని మనము ఆలోచిస్తే
ఈ యెరికో పట్టణం శాపగ్రస్తమైనది కానీ దేవుడు ఆ పట్టణమును ఎంతో ప్రేమిస్తున్నాడు, అటువంటి పట్టణం యేసుప్రభువారు ప్రవేశించినపుడు ఈ పట్టణం సువాసనగల పట్టణంగా మారింది, పాపంతో నింపబడిన, భయంకరమైన విగ్రహారాధనతో నిండిన ఈ పట్టణంలో జక్కయ్య శాపగ్రస్తమైన జీవితం నుండి సువాసనగల జీవితంలోనికి యేసయ్య ద్వారా మార్చబడ్డాడు. 

అందుకే మనం పరిమళ వాసనగా ఉండుటకు క్రీస్తు తనను తాను అర్పించుకొనెను అని దేవుని వాక్యం మనకు చెప్తుంది.

ఎఫెసీయులకు5:2 క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి.

మనలను విమోచించి మనం ఆయనకు పరిమళ వాసనగా ఉండటానికి యేసుప్రభువారు మనలను ఎంతగానో ప్రేమించి తనను తాను అర్పించుకున్నారు, ఆలాగుననే యేసయ్య ప్రవేశించడం వలన జక్కయ మారుమనస్సు వలన యెరికో పట్టణం దేవుని పట్టణముగా, సువాసనగల పట్టణంగా మార్చబడినది.

5.ఈ పట్టణంలో ఒక స్త్రీ రాహాబును గూర్చి మనం ఆలోచిస్తే
రాహాబు ఒక వేశ్య కానీ ఆమె దేవుని గూర్చి తెలుసుకుంది, దేవుని శక్తిని గూర్చి తెలుసుకుంది. ఆమె తన జీవితంలో రక్షణ కావాలి అని అనుకుంది. ఈ పట్టణం నశించి పోయినపుడు తన కుటుంబాన్ని రక్షించాలని కోరుకుంది. ఆమె దేవుని ఎరిగినది కనుక దేవుని బిడ్డలను చేర్చుకున్నది, వారిని దాచిపెట్టింది .కనుక అప్పుడు ఆమె తన కుటుంభం రక్షించబడింది,

ఈమె తన ఇంటికి ఎర్రని దారం కట్టుకుంది ఎందుకు అని మనం ఆలోచిస్తే 

ఎర్రని దారం ఒక గుర్తు., ఈమె దేవుని బిడ్డలను చేర్చుకుంది, ఈమె దేవుని ఎరిగినది అని ఒక గుర్తుగా ఉండటానికి ఆ ఎర్రనిదారం ఇంటికి కట్టుకుంది. ఆనాడు ఐగుప్తు ద్వారములకు తన ప్రజలు రక్షించబడాలి అని గొఱ్ఱెపిల్ల రక్తము గుర్తుగా వ్రాసారు, ఈరోజున మనం క్రీస్తు రక్తము ద్వారా మనకు రక్షణ., అయన రక్తములో మన పాపములను కడుగుకోవాలి అప్పుడే శాపగ్రస్తమైన మన జీవితం సువాసనగ జీవితంగా మార్చబడుతుంది.

ఈరోజున మన యేసయ్య శాపగ్రస్తమైన మన జీవితాలను సువాసనగల ఆశీర్వాదకరమైన జీవితాలుగా మార్చగలడు., అందుకే మన పాపములను బట్టి అయన శాపగ్రస్తుడుగా ఆయిపోయాడు, యెరికోను చూడగానే పాపమును కలిగిన పట్టణంగా మనకు గుర్తుకు రావాలి. యేసయ్య ద్వారా శాపగ్రస్తమైన పట్టణం వంటి మన జీవితం మార్చబడి సువాసనగలదిగా మార్చబడాలి.,  అట్టి కృప, యేసయ్య ఆశీర్వాదం ఎల్లప్పుడు ఉండాలి అని ఆశిస్తూ

యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.






No comments: