Baptist field Council Feb2020




21Feb2020
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev. పగడాల ప్రవీణ్ గారు
నెహెమ్యా 6:3
దేవుని రాజ్యం మిషనరీ వ్యవస్థ

దేవుని ద్వారా అయన ఏర్పరచుకున్న మన ముందు నడచిన పితరులు మనకు ఇచ్చిన దేవుని రాజ్యస్థాపన, దేవుని రాజ్యవిస్తరణ గూర్చి ఈరోజున మనం ధ్యానించుకోవడానికి మనమందరం ఇక్కడ కూడుకొని ఉన్నాం.

1.ఎటువంటి దేవుని రాజ్యం నిర్మించాలనేది దేవుని యొక్క ఆలోచన అని మనం గమనిస్తే

దేవుని రాజ్యం అనేది భౌతిక మైనది కాదు., ప్రభువు తనకు తాను రాజుగా ప్రకటించుకొని తన రాజ్యస్థాపన కొరకు అయన వచ్చారు అని ఎన్నోసార్లుగా స్పష్టంగా అయన చెప్తున్నారు, మన అలవాట్లు మన నియమ నిభందనలతో కూడిన ఒక మతాన్ని అయన కట్టడానికి ఈలోకమునకు రాలేదు కానీ, క్రీస్తు యొక్క భావజాలంలో దేవుని యొక్క రాజ్యం నిర్మించడానికి, ప్రతి ఒక్కరు అయన భావజాలంలోనికి రావాలి అని ప్రభువు యొక్క ఆలోచన, అందుకే ఈలోకానికి అయన వచ్చారు. ఈప్రపంచానికి అయన భావజాలం ప్రకటించడానికి, భూరాజులు అయన రాజ్యంలోకి రావాలి అని అయన కోరిక అటువంటి దేవుని రాజ్యం నిర్మించాలి అని దేవుని ప్రణాళిక.

బైబిల్ గ్రంధములో దేవుని యొక్క మహిమను చాటడానికి దేవుని రాజ్యం నిర్మించడానికి నేహామ్య చేసిన ప్రార్ధనను మనం చుస్తే

నెహెమ్యా1:11యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొఱ్ఱను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొఱ్ఱను ఆల కించి, దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి, మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను, అని ప్రార్థించితిని.నేను రాజునకు గిన్నె అందించువాడనై యుంటిని.

ఇక్కడ వాక్యంలో మనం చుస్తే దేవుని యొక్క పడిపోయిన ప్రాకారములను నిర్మించడానికి రాజు ఎదుట నిలువబడటానికి నేహామ్య చేసిన ఒక ప్రయోగాత్మకమైన సిద్ధపాటుతో కూడిన ప్రార్ధన మనం చూడవచ్చు. అది ఏమిటి అని అంటే మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని అని వ్రాయబడినది ఎందుకు అని అంటే ఆయనకు కలిగిన దర్శనం బట్టి పడిపోయిన, కూలబడిపోయిన దేవుని ప్రాకారములను దేవుని యొక్క రాజ్యమును నిర్మించాలని అయన ఆలోచన కలిగినవాడిగా అయన ప్రార్దిస్తున్నట్లుగా మనం చూస్తాం.

దేవుని రాజ్యమును నిర్మించాలని ఆదిమ కాలంలోనే దేవుడు ఒక క్రమమును ఏర్పాటుచేశాడు అది ఏమిటి అని అంటే

ఆదికాండము 1:28 దేవుడు వారిని ఆశీర్వ దించెను; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను

ఇక్కడ వాక్యంలో దేవుడు మనం బాధ్యత కలిగి జీవించడానికి ఐదు రకములైన ఆజ్ఞలతో కూడిన ఆశీర్వాదములను ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అవి ఏమిటి అని అంటే మనం ఫలించాలి, అభివృద్ధిచెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, లోపరచుకోవాలి.

దేవుడు ఎందుకు వారిని ఏర్పాటుచేశాడు అని మనం ఆలోచిస్తే

ఆదికాండము2:15 మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను.

ఎందుకు అని అంటే మనం దేవుని రాజ్యమును సేద్యపరచుటకు, కాయుటకు, రెండు పదాలు మనం ఫలించుటకు అభివృద్ధిచెందుటకు, విస్తరించుటకు భూమిని నిండించుటకు, లోపరచుకోనుటకు అనేవాటికి ఒక మాధ్యమాలుగా మనం భావించాలి.

క్రైస్తవ భావజాలం ప్రపంచమంతటికి విస్తరించాలి మనం క్రీస్తు ప్రతినిధులుగా సమాధానపడి జీవించాలి, ఇదియే ప్రభువు యొక్క ప్రణాళిక. షాలోమ్ అని అంటే సమాధానము, ఇక్కడ సమాధానము అనగా దేవుని యొక్క ముఖకాంతిలో, దేవుని ఉనికి కలిగి మనం జీవించాలి, ఇటువంటి దేవుని రాజ్య స్థాపన చేయాలి అనేది దేవుని ఆలోచన. కానీ సాతాను దీనికి గండికొట్టాడు, ఎందుకు అని అంటే మనం దేవునికి అవిధేయులమై పాపమునకు బందిలమైపోవుటచేత.

యేసుప్రభువారు లోకమునకు ఎందుకు వచ్చారు, మనలను ఎందుకు పిలుస్తున్నారు అని అంటే

ఈరోజున మనకు వినిపిస్తున ప్రధాన మైన దేవుని సువార్తను గూర్చి మనం ఆలోచిస్తే ., మనం చచ్చిపోతే పరలోకం వెళ్తాము అనేది ప్రధానమైన సువార్తగా మనకు వినిపిస్తుంది.మనం ఆయనకు ప్రార్ధన చేద్దాం అన్నిఆయనే చూచుకుంటాడు అనుకోనుచున్నారు., అటువంటి దేవుని రాజ్యం నిర్మించడానికి ప్రభువు రాలేదుప్రభువు ఈ లోకానికి వచ్చింది., ఈలోకంలో అయన రాజ్యస్థాపన కొరకు గాని పరలోకంలో అయన రాజ్యస్థాపన కొరకు కాదు... ఈలోకంలో అయన రాజుగా అయన రాజ్యస్థాపనకొరకు అయన వచ్చారు. యేసుప్రభువారు శరీరధారిగా అయన అందరికి ప్రభువు, అయన నా దేశానికీ ప్రభువు నా రాజ్యానికి ప్రభువు అను అటువంటి ఆధ్యాత్మికమైన ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి యేసయ్య మనలను పిలుస్తున్నారు లోకంలో అయన రాజ్యస్థాపన కొరకు మనలను ఏర్పరచుకొని మనలను సేద్యపరచుటకు కాయుటకు మనలను పిలుస్తున్నారు.

2.చదవబడిన వాక్యంలో నేహామ్య ఎవరి కొరకు ప్రార్దిస్తున్నాడు అని మనం ఆలోచిస్తే

మొదటిగా మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి; ఇది వారి యొక్క పాపపు స్థితిని సూచిస్తుంది, రెండవదిగా బాప్తిస్మము ఇచ్చే యోహాను ఇచ్చిన నీటి బాప్తిస్మము దేవుని రాజ్యంలోకి చేరడానికి కావలసిన మారుమనస్సును సూచిస్తుంది. మూడవదిగా యేసుప్రభువారి ద్వారా పరిశుద్ధాత్మతోను అగ్నితోను ఇచ్చే బాప్తిస్మము ఇది పరిశుద్దతను సూచిస్తుంది. ఇటువంటి బాప్తిస్మము కలిగి ఉండాలి అని అటువంటి వారితో దేవుని రాజ్యం నిర్మించబడాలి అయన ప్రార్దిస్తూన్నాడు.

ఈరోజున మనం ఎలా ఉండాలి నేహామ్య నుండి మనం ఏమి నేర్చుకోవాలి అని మనం ఆలోచిస్తే

ఈరోజున సమాజంలో, కుటుంభంలో, సంఘంలో- స్త్రీ, పురుషులు అని తేడాలు లేకుండా విలువలతో కూడిన దేవుని రాజ్యస్థాపనకు కావలసిన ప్రాకారములు నిర్మించడానికి ఒక విప్లవాత్మకమైన పిలుపు కొరకు రాజుల ఎదుట అధికారుల ఎదుట నిలువబడాలి. అటువంటి ప్రార్ధన మనం కలిగి ఉండాలి. ఈరోజున ప్రభువు ఏర్పరచిన సంఘములో మనమందరం ఒకొక్క పుణ్యక్షత్రంలా మనం ఉండాలి., దేవుని రాజ్యస్థాపన అనే భారమును మనం కలిగి ఉండాలి,

హెబ్రీయులకు5:7 మీకు దేవుని వాక్యము బోధించి, మీపైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసికొని, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి

3.దేవుని రాజ్య స్థాపనకు మిషనరీ చేసిన సేవను గూర్చి మనం ఆలోచిస్తే 

మొదటిగా భారత దేశంలో ఒక మిషనరీతో మొదలై తరువాత లండన్ మిషనరీ, లూథరన్, S.P.G. అనే మూడు మిషనరీల నుండి ఎనిమిది మిషనరీ వరకు విస్తరించి భారత దేశంలో వారి జీవితాలను ప్రాణార్పణగా పెట్టి మిషనరీ వ్యవస్థను స్థాపించారు. ఎందుకు అని అంటే ప్రజలకు ఒక మంచి జీవితాలను ఇవ్వడానికి, సమాజంలో స్త్రీ పురుషులకు గౌరవాన్ని ఇవ్వడానికి లోకమునకు వారు వెలుగుగా ఉండటానికి దేవుని రాజ్యమును విస్తరింపజేయడానికి కావలసిన పునాదిని వారు ఆనాడు వేశారు. కుష్ఠు రోగులను ఆదరించారు, వారికీ కావలసిన విద్య, వైద్య అవసరములను ఏర్పాటుచేశారు. దేవుని రాజ్యం నిర్మించడం అంటే దేవుని మందిరములను నిర్మించడం కాదు గాని ఒక మంచి సమాజమును నిర్మించడం అని అందరికి విద్యను అందించారు. కులవ్యవస్థను నిర్ములించారు, బాల్య వివాహాలను, నరబలులను నిషేదించారు సతిసహగమనమును రూపు మారారు. వారికీ చక్కగా బట్టలు కట్టుకోవడం నేర్పించారు, దేశంలో విద్యను, వైద్యమును అందించినది మిషనరీలు అటువంటి గొప్ప సేవ ద్వారా మన పితరులైన వారు దేవుని రాజ్యమును నిర్మించారు.

4. రోజున దేవుని రాజ్యమును స్థాపించడానికి మన పిలుపు ఎలా ఉంది

రోమీయులకు12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.

మనం లోకమర్యాదలు అనుసరించక మన ప్రభువులోని రూపాంతరం చెందడమే మన పిలుపై ఉండాలి. పిలుపులో ప్రతి ఒక్కరికి ఒక్కొక భాద్యత ఉంది. పిలుపు వ్యతిరేకంగా అనేకమైన దుర్గములు ఉన్నాయి. అవి మతం, ఆర్థికరంగం, ప్రభుత్వం, కుటుంభం, సమాచారంగం ,విజ్ఞాన విద్య వైద్య లలిత కళలు అటువంటి వాటిని జయించువారిగా మనం ఉండాలి. అంతేకానీ కేవలం మతప్రాతిపదిక ఆధారంగా ఆదివారం ఆరాధనకు పరిమితంగా మనం ఉండరాదుమనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొను టయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు. అటువంటి వారిగ్గా మనం ఉండాలి.

5.ప్రభువు మనకు ఇచ్చిన ప్రత్యక్షత ఏమిటి అని మనం ఆలోచిస్తే 

యోహాను సువార్త 17:6 లోకము నుండి నీవు నాకు అను గ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీవారై యుండిరి, నీవు వారిని నాకను గ్రహించితివి; వారు నీ వాక్యము గైకొని యున్నారు. 11 నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు; నేను నీయొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమై యున్నలాగున వారును ఏకమై యుండు నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. 16 నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు. 18 నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని.

ఈరోజున మనం ఒక్కోకరం ఒక నేహామ్య వలే ఉండవలసిన ఆవసరo ఈరోజున ఎంతైనా ఉంది. మనలో ఒక విలియంకేరి, ఒక విలియం విల్బెర్ట్ ఫోర్స్ రావాలి. నేహామ్య వలే రాజుల ఎదుట భూరాజుల ఎదుట నిలువబడి వారి దయపొందినట్లుగా అటువంటి దేవుని రాజ్య స్థాపన నిర్మించాలి అని ఆశ కలిగి ఉండాలి.

నెహెమ్యా2:5 రాజుతోనీ సముఖమందు నేను దయపొందినయెడల, నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదాదేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసితిని.

ఈరోజున దేశంలో దేవుని గూర్చి తెలియని వారికీ, దేవుని గూర్చి, దేవుని వాక్యమును చెప్పి దేవుని రాజ్యమును నిర్మించిన ఆనాటి బాప్టిస్ట్ సంఘనాయకులు. ఈదేశంలో వైద్య రంగమును స్థాపించినది, కాలువలు త్రవ్వినది, నదులను అనుసంధానము చేసినది, కట్టడాలను నిర్మించినది, పనికి ఆహారంను చేప్పట్టినది కేవలం మన పితరులైన మన ముందు నడిచి దేవుని రాజ్యమును నిర్మించిన ఆనాటి బాప్టిస్ట్ సంఘనాయకులు గొప్పదైన దేవుని పరిచర్యను చేసారు.

6.ఈరోజున నిజమైన పరిచర్యను చేయువారిని ఏవిధంగా గుర్తించాలి వారు ఎవరు అని మనం ఆలోచిస్తే

నిజమైన పరిచర్య చేవారు ఒక చేతితో తాపీ పట్టుకొని దేవుని రాజ్యమును నిర్మించువారిగా ఉంటారు.

నెహెమ్యా4:14 అంతట నేను లేచి చూచి ప్రధానులతోను అధికారులతోను జనులతోనువారికి మీరు భయపడకుడి, మహా ఘనుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసికొని, మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని.

వారు సమాజం పట్ల, కుటుంబపట్ల బాధ్యత కలిగి, నీఇంటిని కాపాడుకొనుటకు, నీ ఉనికిని కాపాడుకొనుటను నేర్పించేవారిగా ఉంటారు. దేవుని ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థితిలోకి చూడాలి, అని స్థానిక కాపరులు అటువంటి కసితో సంఘము కట్టడానికి పనిచేస్తారు

నిజమైన పరిచర్య చేయువారు మరియొక చేతితో ఖడ్గం పట్టుకొని దేవుని రాజ్యమును నిర్మించువారిగా ఉంటారు.

నెహెమ్యా4:17 గోడ కట్టువారును బరువులు మోయువారును బరువులు ఎత్తువారును, ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధము పట్టుకొని యుండిరి.

ఇక్కడ ఖడ్గం పట్టుకొని పోరాడాలి అని అంటే మనం పోరాడేది ఎవరితో అని అంటే

ఎఫెసీయులకు6:12 ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.

మన శత్రువు ఎవరు అంటే వారు కంటికి కనిపించే శరీరులైన వారు కాదుగాని మన దేవుని రాజ్య స్థాపనకు వ్యతిరేకమైన భావజాలంతో మనం పోరాడాలి అటువంటి సంఘనాయకులుగా మనం ఉండాలి.

నెహెమ్యా వలే అటువంటి సంఘనాయకులను తయారుచేవారిగా మనం ఉండాలి.

నెహెమ్యా7:2 నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతియైన హనన్యాకును యెరూషలేముపైన అధి కారము ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటె ఎక్కువగా దేవునియెదుట భయభక్తులు గలవాడు.

నెహెమ్యా ఈరోజున మనకు నేర్పిస్తున్నది ఏమిటి అని అంటే 
నాయకుడు అంటే ఎదుటివారిలో నాయకత్వమును గుర్తించాలి, కాపరి అంటే ఎదుటివారిలో కాపరి లక్షణాలను గుర్తించాలి, అందుకే యేసుప్రభువారు 12మంది శిష్యులను తన రాజ్య స్థాపనకు నిలువబెట్టారు. ఈరోజున సంఘము అంటే బహుళత్వముతో కూడినదిగా మన ప్రభువు నిర్మించారు. అటువంటి మాదిరిని ఇక్కడ నేహామ్య చేసారు., మన పిలుపు నాయకులను తయారు చేయడం, దేవుని రాజ్య స్థాపన కొరకు నాయకులను నిర్మించడం.    

ఆఖరిగా తాను చేసే దేవుని పని గొప్పదిగా ఎంచుకోనువారిగా ఉండటమే నిజమైన సేవకుల పరిచర్యగా మనం గుర్తించాలి.

నెహెమ్యా6:3 అందుకు నేనునేను చేయుపని గొప్పది, దానివిడిచి మీయొ ద్దకు వచ్చుటకై నేను దాని నెందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని.

ఈరోజున అటువంటి విలువలు కలిగి, అందరం సమానం అని, దేవుని రాజ్యం కొరకు పనిచేయాలి. మన ఉనికి దేవుని రాజ్యమును విస్తరింపజేయడం, నిజమైన సేవకులను, నాయకులను తయారుచేయడం, మన ముందు నడచిన నాయకుల విలువలు పాటించి దానికి అనుగుణంగా ప్రణాలికను సిద్ధం చేసుకొని ప్రజలను నిర్మించి దేవుని రాజ్యమును విస్తరింపజేయాలి, అటువంటి గొప్పదైన భాధ్యతను మనమందరం కలిగి ఉండాలి యేసయ్య అందరిని ఆశీర్వదించునుగాక ఆమెన్,

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్
దేవునికి మహిమకలుగును గాక ఆమెన్




No comments: