6-10th Lentdays2020



బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
6thసిలువ శ్రమల ధ్యానకూటములు
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు
అంశం : కాన ఊరిలో యేసయ్య చేసిన అద్భుతం

యోహాను 2:1-11, గలిలయలోని కానాలో, యేసు మొదటి సూచకక్రియను చేసి తన మహిమను బయలుపరచెను; అందువలన ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి. 


కానా అనే ఊరు నజరేతునకు మైలు దూరంలో ఉన్న ప్రదేశం ఊరులో జరుగుతున్న ఒక వివాహానికి యేసుప్రభువారు ఆహ్వానించబడ్డారు.,  విందులో ఆహ్వానించబడినవారికి ద్రాక్షారసము కొరత ఏర్పడింది. అప్పుడు యేసుప్రభువారి తల్లి అయినటువంటి మరియమ్మ గారు ద్రాక్షారసము లేదని వార్తను యేసయ్యకు చెప్పగా, యేసయ్య ఆమెతో అమ్మా, నాతో నీకేమి (పని)? నా సమయ మింకను రాలేదనెను., అప్ప్పుడు ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను., యూదుల శుద్ధీకరణాచారప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతిబానలు అక్కడ ఉంచబడియుండెను. యేసు-- బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా యేసు ప్రభువారు నీటిని ద్రాక్షారసముగా చేసెను, ద్రాక్షారసము ముందు ఇవ్వబడిన దానికంటే శ్రేష్ఠమైనదిగా ఉన్నదని చెప్పబడెను ఇక్కడ మనకు యేసుప్రభువారు నీటిని ద్రాక్షారముగా మార్చిన  ఒక అద్భుతమైన సూచకక్రియ మనకు కనిపిస్తుంది .

ఈరోజున మనం సూచక క్రియ నుండి నేర్చుకోవలసినది ఏమిటీ, మన జీవితాలు ఆశీర్వదించబడాలి అని అంటే మనం ఏమిచేయాలి?

1.మొదటిగా మనం యేసును మన జీవితంలోకి ఆహ్వానించాలి
యేసుప్రభువారు అక్కడ జరుగుచున్న పెండ్లిలో ఆహ్వానించబడ్డారు కాబట్టే యేసుప్రభువువారు అక్కడ పెండ్లి విందులో అద్భుతమైన సూచకక్రియను చేసారు, యేసయ్యను ఆహ్వానిస్తే ఆయన ఉన్నచోట ఆశీర్వాదం ఉంటుంది, యేసయ్య ఉన్నచోట అద్భుతాలు జరుగుతాయి.

బేతనియ గ్రామంలోనున్న లాజరు చనిపోయినపుడు మార్త యేసుతో ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును. అని చెప్పినట్లుగా మనం చూస్తాం. యేసు ఉన్నచోటు మరణం ఉండదు, యేసు ఉన్న చోటున స్వస్థత, యేసు ఉన్న చోటున మనకు ఆశీర్వాదం కలుగుతుంది, అందును బట్టి మనం యేసయ్యను మన జీవితంలో ప్రతి విషయంలో ఆహ్వానించాలి అయన ఇచ్చు ఆశీర్వాదాలు మనం  పొందుకోవాలి.

2.రెండవదిగా అయన చెప్పినది చేయువారిగా ఉంటె మనకు ఆశీర్వాదం
ఇక్కడ జరిగిన విందులో వారు యేసుప్రభువారు చెప్పినట్లుగా రాతి భాలలో నీళ్లు నింపమనగా వారు ఆవిధంగా చేసారు, వారు శ్రేష్ఠమైన ద్రాక్ష రసమును పొందుకున్నారు మనం ఈరోజున అయన మాట ఎవరు వింటారో వారు వారి జీవితంలో ఆశిర్వదాం పొందుకుంటారు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది దేవుని మాట విని ఆయన మాట చొప్పున చేయు వారు బుద్ధిమంతుని పోలి నడుచుకుంటారు అని చెప్తున్నారు, దేవుని మాట చొప్పున మనం చేస్తే ఆశీర్వదం మన ఇంట వస్తుంది మన జీవితంలో అద్భుతాలు చూస్తాం అని దేవుని వాక్యం చెప్తుంది.

3.మూడవదిగా రాతి బానలు నుండి మనం నేర్చుకోవలసినది ఏమిటి అని అంటే
ఇక్కడ రాతి బానలు మనుష్యులమైన మనకు సూచనగా ఉన్నాయి, నీళ్లు దేవుని వాక్యమునకు, మారుమనస్సుకు సూచనగా ఉన్నాయి , ద్రాక్షారసము యేసుప్రభువారి రక్తమునకు సూచనగా ఉంది, అయన మనకొరకు ద్రాక్షారసముగా మారారు, "ద్రాక్ష" రసముగా మారాలి అంటే అది పిండబడాలి, నలుగ గొట్టబడాలి, చిందింపబడాలి, యేసయ్య మన కొరకు నలుగ గొట్టబడ్డారు, ఎందుకు అని అంటే మనకు ఆశీర్వదం ఇవ్వడానికి.,  అటువంటి ద్రాక్షరసం మనలో ఉంటె మనకు ఆశీర్వాదం.

అక్కడ ఉన్న బానలు ఎలాగున నీటితో నింపబడ్డాయో, రాతి బాన వంటి మనం దేవుని వాక్యమనే నీళ్లతో నింపబడాలి, దేవుని వాక్యంలో బలపడాలి, నిత్యం దేవుని వాక్యమును అనుసరించాలి ,అప్పుడు మనలో ఉన్న ప్రతి లోటును యేసుప్రభువారు నింపి ఆశీర్వదంగా కలుగజేస్తారు, అట్టికృప మన అందరికి కలుగును గాక ఆమెన్.

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్. 
**************************************************************
.

బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
7th సిలువ శ్రమల ధ్యానకూటములు
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరంగారు
అంశం : యేసయ్య కుష్ఠిరోగిని స్వస్థపరచుట

మత్తయి సువార్త  8:1-4 అప్పుడు యేసుఎవరితోను ఏమియు చెప్పకు సుమీ; కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను.

చదవబడిన వాక్యభాగములో మనం గమనిస్తే యేసుప్రభువారు ఆయన ఆ కొండమీదనుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కిప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. యేసుప్రభువారు కుష్ఠు వ్యాధి గల వానిని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టరోగము శుద్ధి యాయెను. యేసుప్రభువారు కుష్ఠరోగిని ముట్టి స్వస్థపరచినట్లుగా మనం చూస్తాం. అయన చెయ్యి చాపి ఆ వ్యాధి గ్రస్తుని స్వస్థపరచి సాక్ష్యార్థమై యాజకునికి కనబరచుకొనుమని సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం.

1.పాతనిభందన గ్రంధములో ఈ కుష్ఠు వ్యాధిని గూర్చి ఏమి వ్రాయబడినదో మనం చుస్తే
లేవీయకాండము 13:55-57 55 ఆ పొడగల దానిని ఉదికిన తరువాత యాజకుడు దానిని చూడవలెను, ఆ పొడ మారకపోయినను వ్యాపిం పక పోయినను అది అపవిత్రము ,అగ్నితో దానిని కాల్చి వేయవలెను, అది లోవైపునగాని పైవైపునగాని పుట్టినను కొరుకుడు కుష్ఠముగా ఉండును,56 యాజకుడు దానిని చూచినప్పుడు వస్త్రము ఉదికిన తరువాత ఆ పొడ వాడి యుండినయెడల, అది ఆ వస్త్రములో ఉండినను తోలులో ఉండినను పడుగులో ఉండినను పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలెను 57 అటుతరువాత అది ఆ వస్త్రమందేగాని పడుగునందేగాని పేకయందేగాని తోలుతో చేసిన దేనియందేగాని కనబడినయెడల అది కొరు కుడు కుష్ఠము,ఆ పొడ దేనిలో నున్నదో దానిని అగ్నితో కాల్చివేయవలెను,

కుష్టు వ్యాధి లక్షణములు మనం ఒకసారి గమనిస్తే
1స్పర్శ తెలియకుండుట 2అసహ్యముగా కనబడుట  3అంటువ్యాధి

కుష్ఠువ్యాధి శరీరమును పాడుచేస్తుంది ,కుష్టు వ్యాధి పాపానికి సాదృశ్యం
కుష్ఠువ్యాధి శరీరమును లోలోపల తినివేస్తుంది పాపాముకూడా అదేవిధంగా న శరీరమును తినివేస్తుంది, కుష్ఠువ్యాధి శరీరమును పాడుచేస్తుంది, ఇది అందరికి పాకుతుంది.

కుష్టు వ్యాధి ఒక అంటువ్యాధి, పాపం కుటుంబానికి ప్రజలకు దూరం చేస్తుంది.

పాపం కూడా అటువంటిదే ఒక అంటువ్యాధి, ఈ వ్యాధి దేవునికి, కుటుంబానికి దూరం 

చేస్తుంది.  పాపం దేవుని ద్రుష్టికి అంటువ్యాధికి సాదృశ్యంగా ఉంది, పాపం కూడా ఒకరి నుండి 

ఒకరికి అదేవిధంగా పాకుతుంది., ఈ వ్యాధి కూడా కుటుంబానికి ప్రజలకు దూరం చేస్తుంది.

పాపం మన కుటుంబానికి ఎలాగున దూరం చేస్తుంది అని అంటే
మనం మరణమైన తరువాత వాని క్రియల చొప్పున దేవుడు తీరుస్తాడు అప్పుడు మనలను ఈ పాపం మనలను కుటుంభం నుండి వేరుచేసి పరలోకంలో చేరుటనుండి దూరం చేస్తుంది, అప్పుడు మన కుటుంభం పరలోకంలో ఉంటె పాపంలో ఉన్నమనం  తీర్పుకాలమున నరకంలోనికి త్రోయబడతాము, ఇది మానసికంగా భాదకు గురిచేస్తుంది పాతనిభందన గ్రంధములో దీనికి విరుగుడులేదు.

2.మనం ఇటువంటి కుష్ఠు వ్యాధి అనే పాపం నుండి విడుధుల పొందాలి అని అంటే ఏమిచేయాలి
క్రొత్తనిభందనలో మనం గమనిస్తే యేసుప్రభువారి యొద్దకు వస్తే ఆవ్యాధి నుండి స్వస్థత కలుగుతుంది., ఎలాగైతే ఆ వ్యక్తి కుష్ఠు వ్యాధి నుండి స్వస్థతపొందాడో ఆవిధంగా మనం యేసుపాదాల మీద పడి ప్రాధేయపడాలి, సాగిలా పడాలి. పాపమును మన రోగములను తొలగించుకోవాలి.  అప్పుడు యేసుప్రభువారు భరించిన గాయములు నుండి మనకు స్వస్థత కలుగుతుంది. అయన పడిన బాధలు నుండి అయన చిందించిన రక్తము నుండి మన పాపముల నుండి విడుదల కలుగుతుంది. ఆయనకు విరోధముగా ఏమైనా పాపం ఉంటె యేసుప్రభువారి దగ్గరకు వచ్చి ప్రభువును అడుగుదాము పాపమూ అనే వ్యాధి నుండి స్వస్థత పొందుకుందాం 

పాపం కుష్ఠు వ్యాధికి సాదృశ్యంగా ఉన్నది ఈ రోజున అటువంటి పాపములను మనం విడిచిపెట్టి మనం దేవుని బిడ్డలుగా మన యేసయ్యను ఆశ్రియిస్తే., అయన మనలను పాపo అనే వ్యాధి నుండి పరిశుద్ధ పరచి అయన రక్తములో మనలను కడిగి మనలను స్వస్థపరచి రక్షిస్తారు అట్టికృప మన అందరికి అందించును గాక ఆమెన్.. 

యేసయ్య ఈ మాటలను దీవించును గాక  ఆమెన్..



దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్..  
***********************************************************

బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
8thసిలువ శ్రమ ధ్యానకూటములు
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు
అంశం :పక్షవాయువు గలవానిని బాగుచేయుట

చదవబడిన వాక్యభాగములో మనం చుస్తే ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని గూర్చి వ్రాయబడినది, ఈపక్షవాయువు అనే వ్యాధిగల వారిది చాల బాధాకరమైన పరిస్థితి, వారి అవయవములు పనిచేయని,సహకరించని పరిస్థితి. అంతేకాకుండా ఈవ్యాధి వ్యాధిగ్రస్తుణ్ణి చాల కృంగదీస్తుంది.  అటువంటి వ్యాధికలిగిన వ్యక్తిని నలుగురు వ్యక్తులు యేసుప్రభువారిదగ్గరకు తీసుకురావడం జరిగింది, యేసుప్రభువారు ఆవ్యాధి నుండి వ్యక్తిని బాగుచేసినట్లుగా మనం చూస్తాం.

ఐతే ఇక్కడ మన తెలుసుకోవలసినది ఏమిటి అని అంటే అక్కడ అనేకమంది రోగులు ఉండగా బైబిల్ గ్రంధములో ఈవ్యక్తిని గూర్చి ఎందుకు వ్రాయబడినది అని మనం ఆలోచిస్తే ఇక్కడ మనకు రెండు ప్రత్యేకతలు కలిగిన వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు.
ఈరోజున మనం ఆ పక్షవాయువుకలిగిన వ్యక్తిని తీసురాబడిన వారి ప్రత్యేకత గూర్చి మరియు యేసుప్రభువారి యొద్దకు తీసుకురాబడిన ఆ వ్యక్తి యొక్క ప్రత్యేకత గూర్చి మనం తెలుసుకోవలసిన వారమైఉన్నము.

1.మొదటిగా ఆ పక్షవాయువుకలిగిన వ్యక్తిని తీసురాబడిన వారి ప్రత్యేకత గూర్చి మనం ధ్యానించుకుంటే
ఆ పక్షవాయువుకలిగిన వ్యక్తికి సహకరించిన వారి యొక్క ప్రత్యేకతను ఏమిటి అని అంటే వారిలో ఎదుటివారు కష్టములో ఉన్నపుడు సహాయం చేసే గుణం మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా అటువంటి వ్యాధి కలిగిన వ్యక్తిని యేసయ్య దగ్గరకు తీసుకురావడం ఇంకొక ప్రత్యేకత. ఆ నలుగురు వ్యక్తులలో సహాయం చేసే గుణం ఉన్నది, అందుకే దేవుని వాక్యం చెప్తుంది మేలైనది చేయగలిగినది చేయుడి అని ఈరోజున మనం కూడా ఇతరులకు కష్టములలో ఉన్నవారికి మేలైనది చేయువారిగా ఉండాలి.

వారిలో ఉన్న రెండవ గుణం ఏమిటి అని అంటే వారు అపక్షవాయువు కలిగిన వ్యక్తిని యేసుప్రభువారి యొద్దకు తీసుకురావడం, ఇక్కడ మనకు యేసుప్రభువారిపై వారికీ ఉన్న గొప్ప విశ్వాసం మనకు కనిపిస్తుంది. యేసయ్య ఎంతటి వ్యాధిగ్రస్తుడినైనా బాగుచెయ్యగలడు అయన స్వస్థపరచు దేవుడు అని వారికీ గొప్ప నమ్మకం. ఈరోజున మనం కూడా అటువంటి గొప్ప విశ్వాసం కలిగి, బలహీనులైన వారిని యేసయ్య దగ్గరకు తీసుకువచ్చే వారీగా మనం ఉండాలి.  వారి ఆశ, దేవునిపై విశ్వాసం కాకుండా మనకు వారియొక్క  ప్రయాస కూడా మనకు కనబడుతుంది అది ఏమిటి అని అంటే వారు ఆవ్యక్తిని ఇంటి పైకప్పు నుండి మంచం మీద యేసయ్య వద్దకు తీసుకు వచ్చారు. ఆయనను తీసుకురాబడిన వారిని బట్టి యేసయ్య మీద వారికున్న గొప్ప విశ్వాసం బట్టి ఎంతో మందికి లేని ధన్యత ఆవ్యక్తికి బైబిలుగ్రంధములో దక్కింది.

2.రెండవదిగా యేసుప్రభువారి యొద్దకు తీసుకురాబడిన ఆ వ్యక్తి యొక్క ప్రత్యేకత గూర్చి ఈరోజున తెలుసుకోవలసిన వారమైఉన్నము.
ఆవ్యక్తిని యేసుప్రభువారు నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను, ఈమాటను యేసుప్రభువారు ఎందుకు పలికారు అని అంటే హృదయాంతరములను ఎరిగిన యేసయ్య., ఆవ్యక్తి తన పాపముల బట్టి పడుచున్న పశ్చాతాపమును గ్రహించి పలికినట్లుగా మనం చూస్తాం, మనుష్యులు పై రూపం చూస్తారు గాని మన యేసయ్య హృదయాంతరములు ఎరిగినవాడు. అంతేకాకుండా ఆ వ్యక్తికి శారీరక స్వస్థతయే కాకుండా ఆధ్యాత్మిక స్వస్థత కావాలి అని యేసయ్య ఈమాటలను పలికారు.
అందుకే మనకు ఆధ్యాత్మిక స్వస్థత కావాలి అంటే మనపాపములు క్షమింపబడాలి అని దేవుని చెప్తుంది. 
యెషయా గ్రంథము 59:1రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను.
దేవునికి మనకు అడ్డంగా పాపం ఉంది అటువంటి పాపం క్షమించబడితేనే మనకు స్వస్థతను పొందుకుంటాం, వ్యాధులు వస్తాయి, పోతాయి కానీ పాప క్షమాపణ లేదు, పాపిని అని అంగీకరించి ఒప్పుకుంటే మనకు స్వస్థత కలుగుతుంది
అని దేవుని చెప్తుంది. 
1 యోహాను 1:9 మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.


ఎందుకు మనకు స్వస్థత కల్గుతుంది అంటే మన యేసయ్య పరిశుద్ధుడు, అయన శరీరం పరిశుద్ధం అయన రక్తంలో పరిశుద్ధత ఉంది, ఆలాగున మనంకూడా పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి అయన గొప్పదైన రాజ్యంలోకి మనమందరం ప్రవేశించువారిగా ఉండాలి అట్టి కృప మన అందరికి కలుగును గాక ఆమెన్.
యేసయ్య ఈమాటలను దీవించును గాక ఆమెన్.
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

**************************************************


బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
9th సిలువ శ్రమల ధ్యానకూటములు
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరంగారు
అంశం :యాయీరు కుమార్తెను బ్రతికించుట 

మత్తయి సువార్త  9:18-25, 24 స్థలమియ్యుడి; ఈ చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. 25 జనసమూహ మును పంపివేసి, ఆయన లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను.

చదవబడిన వాక్యభాగమును మనం గమనిస్తే ఇక్కడ మనకు యాయీరు అను ఒక సమాజమందిరపు అధికారి మనకు కనిపిస్తున్నాడు. బైబిల్ గ్రంధములో మనం చుస్తే అనేక మంది యాయీరులను గూర్చి వ్రాయబడినది. వాక్యభాగమును మనం గమనిస్తే యేసుప్రభువారు సముద్రతీరమున నుండగా సమాజమందిరపు అధికారులలో యాయీరను నొకడు వచ్చి, ఆయనను చూచి ఆయన పాదములమీద పడి నా చిన్నకుమార్తె చావనై యున్నది; అది బాగుపడి బ్రదుకునట్లు నీవు వచ్చి దానిమీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా అని వ్రాయబడినది అప్పుడు అయన ఇంటి దగ్గర నుండి కొందరు వచ్చి ని కుమార్తె చనిపోయినది భోదకుని ఇబ్బందిపెట్టొద్దని వారు అనిరి.

1.మొదటిగా ఇక్కడ యాయీరు నుండి మనం నేర్చుకోవలసినది ఏమిటి అని అంటే ఆయనకున్న విశ్వాసం, దేవుని దగ్గర తగ్గింపు మనం కలిగి ఉండాలి.

ఇక్కడ ఒక అధికారి కుమార్తె ఒక వ్యాధితో బాధపడి చనిపోయినది ఆ యాయీరు ఒక బాధ్యత కలిగిన తండ్రిగా కుటుంబమును చుకోవలసిన బాధ్యత కలిగినవాడు, సమాజమందిరపు అధికారపు బాధ్యత కలిగినవాడు అతడు తన కుమార్తెను గూర్చి యేసుప్రభువారి వద్దకు వస్తే తన కుమార్తె బ్రతుకుతుంది అని విశ్వాసంతో అయన యేసుప్రభువారిని బ్రతిమిలాడుచున్నాడు అతడు తన కూతురు చనిపోయినది చెప్పినపుడు కూడా అతనికి యేసుప్రభువారి మీద ఉన్న విశ్వాసంతో అయన యేసుప్రభువారి పాదాల వద్దకు వచ్చాడు ఎందుకు అని అంటే ఎంతటి గొప్ప వ్యాధినుండి ఐన మరణము నుండి ఐన విడిపించగలిగినవాడు యేసుప్రభువారు అని గొప్ప విశ్వాసం కలిగినవాడు, అతడు తనను తాను తగ్గించుకొని వచ్చాడు

2.ఈరోజున మనం ఈ యాయీరు వారివలె దేవుని దగ్గర తగ్గించుకొని రావలసినవారమై ఉన్నాము, 

యేసుప్రభువారు దగ్గర గొప్ప, పేదవారు అని బేధాలు లేవు. ఎటువంటి వారమైన అయన మనలను స్వస్థపరచువాడు. యేసుప్రభువారి యొద్దకు వచ్చిన వారు తగ్గించుకొని రెండు చేతులు జోడించి మోకాళ్లూని కన్నీటితో ఆయనను అడగాలి, అక్కడ యేసుప్రభువారు అక్కడ అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యాయీరు అధికారము కలిగినవాడు కానీ అయన తగ్గించుకొని యేసుప్రభువారి పాదాల యొద్దకు వచ్చి బ్రతిమాలలాడుచున్నాడు. మనం కూడా అటువంటి వారీగా ఆధ్యాత్మికంగా ఎదగాలి అని యేసయ్య కోరుచున్నారు.
రెండవదిగా ఈ యాయీరును చూసి మనం ఏమి నేర్చుకోవాలి అని ఆలోచిస్తే
ఇక్కడ ఆ తండ్రి యొక్క విధేయత మనం చుస్తే నా కుమార్తె చనిపోయినది, ఐనను నువ్వు వస్తే ఆమె బ్రతుకుతుంది అని పలికాడు, ఇక్కడ అయన యొక్క గొప్ప విశ్వాసం అయన కుమార్తెను బ్రతికించింది, అటువంటి గొప్ప విశ్వాసం ఈ రోజున మనం కలిగి ఉండాలి . ఈరోజున యేసును కలిగి ఉన్నవారికి అయన ఉన్నారు అని దైర్యం, దేవుని యొక్క శక్తిని తెలిసినవారిగా ఆయనను మనం చూచి దైర్యం కలిగి ఉండాలి. యేసు ఉంటె మన జీవితంలో దైర్యం కలుగుతుంది., ఎందుకు అని అంటే జీవం పోసేవాడు ఆయనే., మన ఆత్మను ఇచ్చినవాడు ఆయనే ఆత్మను పోషించేవాడు ఆయనే. అందుకే మన జీవితమును అయన చేతులకు అప్పగించాలి.

3.మూడవదిగా యాయీరు అను మాటకు ఆయనే వెలుగించును అని అర్ధం

కాని ఎవరు వెలిగిస్తారు అని అంటే, యాయీరు యేసును కలిగి., యేసు యందు విశ్వాసం కలిగి వెలిగింపబడ్డాడు, తన కుమార్తెను బ్రతికించుకున్నాడు. కనుక ఈ రోజున ఎవరైతే అవిశ్వాసంగా ఉన్నారో వారిని అందరిని వెలిగించడానికి ఒక వెలుగుగా ఉన్నాడు.
యాయీరు యేసుప్రభువారు అనే నూనె ద్వారా ఎలా వెలిగింబడ్డాడో., ఈరోజున మనం ఆవిధంగా విశ్వాసం అనే నూనె ద్వారా మనం కూడా వెలిగింపబడాలి. వెలుగు దీపాలవలె అయన రాజ్యములోనికి ప్రవేశించాలి. అయన పరిశుద్ధమైన రక్తము ఒక వెలుగు లా మనలను వెలుగిస్తుంది. అయన పడిన భాదలు అయన పడిన వేదన వర్ణనాతీతం.

ఈరోజున మనం అటువంటి ప్రభువును కలిగి దేవుని యెడల భయభక్తులు కలిగి చీకటిలో ఉన్న మనలను మన విశ్వాసంతో దినదినము వెలుగుతూ వెలిగింపబడాలని కోరుతూ అట్టికృప మన అందరికి యేసయ్య ఇచ్చును గాక ఆమెన్..

యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్..

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్..


 






No comments: