Jan2020 Messages



1Jan2020నూతన సంవత్సర ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరంగారు

యెషయా 40:27-31
29 సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే.

ప్రియులారా మన జీవితంలో దేవాది దేవుడు అన్నివిషయాలలో అయన మనకు సహాయపడి మరియొక నూతన సంవత్సరమును ఆయన మనకు ఇచ్చాడు, ఏవిధంగా నూతన సంవత్సరమును దేవుడు మనకు ఇచ్చాడో ,ఈలాగున మనం నూతనమయినవి కొన్ని కలిగి ఉండాలి అని దేవుడు రోజున ఆశపడుతున్నారు.

  రోజున నూతనంగా ఏమి కలిగి ఉండాలో, నూతనంగా దేవుడు మనకు ఏమి ఇస్తాను అని మాట్లాడుతున్నాడో  దేవుని వాక్యంలో మనం ధ్యానిద్దాం.

1.మొదటిగా దేవుని బిడ్డలుగా మనం నూతన బలం పొందుకోవాలి.
 
యెషయా 40:31 యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.

చదవబడిన వాక్యంలో యెషయా ప్రవక్త ద్వారా ప్రవచిన మాటలను మనం గమనిస్తే యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు అని వ్రాయబడినది, ప్రియులారా రోజున మన అందరికిని, ప్రతి ఒక్కరికి, మరియు ప్రతి ఒక్క విశ్వాసికి  నూతన మైన బలము చాల అవసరమైఉన్నది అనే విషయం జ్ఞాపకం చేస్తుంది.

ఏమిటి నూతన బలం దేనికి నూతన బలం  అవసరం అని మనం ఆలోచిస్తే

దేవుని బిడ్డలుగా దేవుని నమ్ముకొనిన వారీగా పరలోక రాజ్యం చేరాలి అని అనుకొనువారికి నూతన బలం చాల అవసరం, ఎందుకు అని అంటే బలహీనులుగా మనం ఉంటె మనం దేవుని బిడ్డలుగా ఏదైనా సాదించాలి అంటే సాధించలేము అందుకని మనకు నూతన బలం అవసరం.

వాక్యంలో మనం గమనిస్తే ఒక పక్షిరాజును మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, ఒక పక్షి ఎగరాలి అని అంటే రెక్కలు చాల అవసరం ఆలాగుననే క్రైస్తవ విశ్వాసికి వాక్యము మరియు ప్రార్ధన అనే రెండు  బలమైన రెక్కలు కలిగి ఉండాలి, మనం   దేవుని వాక్యంలో బలపడాలి,  ప్రార్ధనలో బలపడాలి  దేవుని రాజ్యము చేరటానికి బలం చాల అవసరం.

క్రైస్తవ విశ్వాసి నూతన బలం పొందుకోవాలి అని అంటే మన పాపములను, దోషములను పక్షిరాజు వలే మనకు మనం పెరికివేసుకొని నూతన బలం పొందుకోవాలి.

పౌలు భక్తుడు పలికినట్లుగా ప్రతి పాపమును మనం విసర్జించి నూతన బలమును పొందుకొని దేవుని రాజ్యమును గూర్చి ఎదురుచూచే దేవుని బిడ్డలుగా, దేవుని వాక్యమును నిత్యం ధ్యానించే వారీగా మనం ఉండాలి అని యేసయ్య మనలను కోరుచున్నారు.

2.రెండవదిగా నూతన హృదయము  కలిగిన వారీగా మనం ఉండాలి.

యెహెజ్కేలు 36:26 నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను.

ఎందుకు మనం నూతన హృదయం మరియు నూతన స్వభావం కలిగి ఉండాలి.
ఎందుకుఅని అంటే హృదయం చాల ప్రాముఖ్యమైన నటువంటిది, హృదయము మోసకరమైనటువంటిది, అందువలన చెడు ఆలోచనలు కలిగిన,  పాడై పోయిన హృదయం కలిగి ఉంటె మనం నశించిపోతాము. అందుకనే దేవుడు  మన రాతి హృదయమును తీసి వేసి నూతన హృదయం ఇస్తాను అని అంటున్నాడు, మనలో ఏరకమైన హృదయం కలిగి ఉంటున్నామో మనం ఆలోచించుకోవాలి.

మనకు నూతన హృదయం కలిగి ఉండాలి అని అంటే మనం ఏమిచేయాలి అని ఆలోచిస్తే
 
మనం నూతన హృదయం కలిగి ఉండాలి అంటే మనం దేవుని వాక్యం మనం మన హృదయంలో నింపుకోవాలి, ప్రార్ధనతో మన హృదయం నింపుకోవాలి మంచి మనసు కలిగి ఉండాలి. పాతవి గతించెను ఇదిగో నూతన మాయెను అని వాక్యంలో పలికి నట్లుగా మనం రోజున మనం నూతన హృదయము కలిగిన వారముగా దేవునిలో బలపడే వారీగా మనం ఉండాలి అని యేసయ్య కోరుచున్నారు.

3.మూడవదిగా నూతన ఆత్మను కలిగి ఉండాలి అని దేవుని వాక్యము చెప్తుంది.
 
యెహెజ్కేలు 11 :19 వారు నా కట్ట డలను నా విధులను అనుసరించి గైకొను నట్లు నేను వారి శరీరములలోనుండి రాతిగుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి, వారికి ఏకమనస్సు కలుగజేసి వారియందు నూతన ఆత్మ పుట్టింతును.

మన అందరికి పాపము నుండి దూరపరచడానికి దేవుని ఆత్మ మనకు కావాలి, అటువంటి పరిశుద్దాత్మ దేవుని యొక్క విధులను కట్టడాలను అనుసరించి  గైకొను నట్లుగా మనకు నూతన సంవత్సరములో మన ఆధ్యాత్మిక జీవితం కొనసాగించడానికి నూతన ఆత్మను మనం పొందుకోవాలి శరీరానుసారులుగా కాకుండా ఎన్ని శోధనలు వచ్చిన దేవుని రాజ్యమును పొందుకోవడానికి నూతన ఆత్మ కలిగి ఉండాలి.

నూతన బలము కలిగి, నూతన హృదయం, నూతన ఆత్మ మనం నూతన సంవత్సరoలో పొందుకోవడానికి యేసయ్య కృపఎల్లపుడు మనకు తోడైఉండునుగాక ఆమెన్..

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్..

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్..

**************************************************************



05Jan2020ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరంగారు

కీర్తనల 8:1-4 నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటి వాడు?

దావీదు భక్తుడు ఎల్లప్పుడును దైవ జ్ఞానం,లోక జ్ఞానం, దైవ భక్తి కలిగినటువంటివాడు. దావీదు భక్తుడు ఈలోకమును చూస్తూ చంద్ర నక్షత్రములు చూస్తూ దేవుని యొక్క గొప్పతనమును తెలుసుకొనినవాడు.
 
చదవబడిన వాక్యభాగమును మనం గమనిస్తే,  అసలు మనిషిని దేవుడు జ్ఞాపకము చేసుకొనుటకు నరుడు ఏపాటివాడు అని దావీదు పలుకుచున్నట్లు మనం చూస్తాం. 
ఈలోకంలో దేనికి లేని విలువ దేవాది దేవుడు మనుష్యునికి ఇచ్చాడు, మనలను జ్ఞాపకం చేసుకొనుటకు మనకు ఏపాటి అర్హత లేకపోయినప్పటికిని అయన మనలను జ్ఞాపకం చేసుకొనుచున్నాడు, బైబిల్ గ్రంధములో అనేక మంది దేవుని జ్ఞాపకం చేసుకున్న సందర్బములు మనకు తెలుసు, అదేవిధంగా దేవుడు మనుష్యులను జ్ఞాపకం చేసుకున్న సందర్బములు అనేకం.

దేవుడు ఎందుకు మానవులమైన మనలను జ్ఞాపకం చేసుకొనుచున్నాడు అని మనం ఆలోచిస్తే

కీర్తనల 78: 39 కాగావారు కేవలము శరీరులై యున్నారనియు విసరి, వెళ్లి మరలి రాని గాలివలె నున్నారనియు ఆయన జ్ఞాపకము చేసికొనెను.

మనం ఈలోకంలో శరీరులమై ఉండగా కష్టములలో, భాదలలో పోరాడలేక బలహీనులుగా మనం ఉండగా శరీరులుగా బలహీనులమని దేవుడు మనలను జ్ఞాపకం చేసుకొనుచున్నాడు అని దేవుని వాక్యము మనకు చెప్తుంది.   

బైబిల్ గ్రంధములో అనేక మంది భక్తులు తమ తమ కష్టములలో ఉండగా దేవుడు జ్ఞాపకం చేసుకున్న సందర్బములను గూర్చి మనం గమనిస్తే

1.మొదటిగా నోవహును దేవుడు జ్ఞాపకం చేసుకున్న పరిస్థితిని గూర్చి మనం ఆలోచిస్తే 

ఆదికాండము 8:1 దేవుడు నోవహును అతనితోకూడ ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసికొనెను. దేవుడు భూమిమీద వాయువు విసరునట్లు చేయుటవలన నీళ్లు తగ్గిపోయెను.

దేవుడు జలప్రళయం సమయంలో ఓడలోనున్న నోవహును అతని సమస్త కుటుంబమును జ్ఞాపకము చేసుకున్నట్లుగా దేవుని వాక్యము మనకు చెప్తుంది.

ఎందుకు అని అంటే దేవుని యెడల అయన  నీతిని బట్టి ఆ యొక్క జలప్రళయం సమయంలో తన భక్తుడైన  నోవహును ఓడలోనున్న ప్రస్తుత స్థితి నుండి తిరిగి మరల సాధారణస్థితిలోనికి బయటకు తీసుకురావడానికి దేవుడు అతనిని జ్ఞాపకం చేసుకున్నాడు. 

ప్రియులారా దేవుడు మనలను కూడా మన శ్రమలను, బాధల నుండి బయటకు తీసుకురావటానికి అయన మనలను జ్ఞాపకం చేసుకొనే దేవుని బిడ్డలుగా ఈలోకంలో మనం జీవించాలి, అటువంటి భక్తి కలిగిన జీవితం మనం కలిగి ఉండాలి

2.రెండవదిగా హన్నా శ్రమలలో మరువక దేవుని జ్ఞాపకం చేసికొనిన పరిస్థితిని మనం చుస్తే 

1సమూయేలు 1:11 సైన్యములకధి పతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసినయెడల, వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసికొనెను.

హన్నా బహుదుఃఖా క్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థనచేయుచు బహుగా ఏడ్చుచు తనకు కలిగియున్న శ్రమను చూచిదేవుని మరువక జ్ఞాపకము చేసికొనేను,

మనం కూడా మన జీవితంలో మనకు కలిగిన శ్రమలలో దేవుని జ్ఞాపకం చేసుకొని మన ఏసయ్యను ఆశ్రయించువారిగా మనం ఉండాలి.

3.మూడవదిగా మనం చుస్తే హిజ్కియా రాజు మరణకరమైన స్థితిలో ఉన్నపుడు దేవుని జ్ఞాపకం చేసుకొనెను.

2రాజులు 20 :3 యెహోవా, యథార్థ హృదయుడనై, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచు కొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను.

హిజ్కియా రాజు మరణపడకలో ఉన్నపుడు అయన యథార్థ హృదయుడనై, సత్యముతో దేవుని సన్నిధిలో కృపతో తనను జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు మొరపెట్టినపుడు దేవుడు ఆయనకు పదిహేను సంవత్సరములు ఆయుస్సును దయచేసాడు.

ఈరోజున మనం హిజ్కియా రాజు వలే దేవుని యెడల యథార్థ హృదయముతో నడుచుకోవాలి అయన సన్నిధిలో మనం దేవుని దృష్టికి అనుకూలంగా నడచుకొనువారిగా ఉండాలి దేవుడు మనలను ఎందుకు ఎన్నుకొన్నాడో తెలుసుకొని అయన సంఘములో ఆయనకు ఇష్టమైన వారీగా మనం ఉండాలి.   

ఈరోజున మనం యథార్థ హృదయముతో,సత్యముతో దేవునికి మొరపెడితే అప్పుడు అయన మనకు కావలసినది మనకు దయచేస్తాను  అని మనతో ఈరోజున మాటలాడుచున్నాడు.

4.మానవులమైన మన జీవితం ఎటువంటిది మనం ఎందుకు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి అని మనం ఆలోచిస్తే?

మానవుని జీవితం నీటి బుడగ వంటిది  వట్టి  కుండ వంటిది, మనం విసిరి వెళ్లే గాలి వంటి వారం అని దేవుని వాక్యం చెప్తుంది అందుకే దావీదు అంటున్నాడు మనుష్యులు ఏపాటి వారు దేవుడు  జ్ఞాపకం చేసుకోవడానికి అని, అటువంటి ఈ అల్పమైన శరీరాన్నికి నిత్యం ఏమి కావాలో అయన మనకు అనుగ్రహిస్తున్నాడు అందుకే మనం ఆ దేవాది దేవుని నిత్యం జ్ఞాపకం చేసుకోవాలి. 

అయన ఈ లోకంలో మన కొరకు శ్రమ పడిన అయన శరీరమును జ్ఞాపకం చేసుకోవాలి అయన చిందించిన రక్తమును మనం జ్ఞాపకం చేసుకోవాలి.

5.ఎందుకు మన యేసయ్య శరీరమును రక్తమును జ్ఞాపకము చేసుకోవాలి అని మనం ఆలోచిస్తే?

మత్తయి 26: 26-30 వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను. 28 ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము.

1 కొరింథీ11:24 దానిని విరిచియిది మీకొరకైన నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.

ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, ఎందుకూపనికి రాని మన జీవితంలో మన పాపం నుండి, శాపం నుండి విమోచించడానికి అయన తన శరీరంను రక్తమును మనకు ఇచ్చాడు అందుకు మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెప్పి అయన పడ్డ శ్రమలను జ్ఞాపకం చేసుకొని మన జీవితాలను బాగుచేసుకోవాలని, బాగుపడాలి అని మనలను అయన శరీరమును రక్తమును జ్ఞాపకం చేసుకోవాలని యేసయ్య  మనకు చెప్పుచున్నారు.

6.అంతే కాకుండా అంత్య  దినములలో అపాయకరమైన పరిస్థితిలో ఉన్నాము కాబట్టి  దేవుని మనం జ్ఞానపకం చేసుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది.

ప్రసంగి 12:1 దుర్దినములు రాకముందేఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే,

దేవాది దేవుడు మనలను సృజించాడు కాబట్టి సృష్టికర్త ఐన మన ఏసయ్యను ఈ అంత్య దినానములలో భయంకరమైన దుర్దినములు రాకముందే ఇప్పుడు జాగ్రత్తగా ఉండుటకు మనం మన దేవుని జ్ఞాపకము చేసుకోవలసిన వారమైఉన్నము.

అల్పులమైన మనలను ప్రేమించి మన కొరకు తన ప్రాణాలను ఇచ్చిన మన యేసుప్రభువారిని శ్రమలలో, భాదలలో మనలను రక్షించి అయన  చేసిన మేలులకు  కృతజ్ఞత చెల్లిస్తూ సహృదయంతో ఆయనను జ్ఞాపకము చేసుకోవలసిన వారీగా ఉండాలి దేవుడు మనలను కూడా మన శ్రమలను, బాధల నుండి బయటకు తీసుకురావటానికి అయన మనలను జ్ఞాపకం చేసుకొనే దేవుని బిడ్డలుగా ఈలోకంలో మనం జీవించాలి అని ఆశిస్తూ..
    
యేసయ్య ఈ మాటలను దీవించును  గాక  ఆమెన్..


దేవునికి మహిమ కలుగును  గాక  ఆమెన్..

********************************************

12Jan2020ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరంగారు

మార్కు 5:35-41 
36యేసు వారు చెప్పినమాట లక్ష్య పెట్టకభయ పడకుము, నమి్మక మాత్రముంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి.

ఇక్కడ చదవబడిన వాక్యభాగములో మనం చుస్తే , యేసు సముద్రతీరమున నుండగా సమాజమందిరపు అధి కారులలో యాయీరను నొకడు వచ్చి కూతురుకి కలిగిన వ్యాధిని బట్టి ,ఆయనను చూచి ఆయన పాదములమీద పడి, నా చిన్నకుమార్తె చావనై యున్నది; అది బాగుపడి బ్రదుకునట్లు నీవు వచ్చి దానిమీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా, సమయంలో అధికారి యింట నుండి కొందరు వచ్చినీ కుమార్తె చనిపోయినది; నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు వనిరి. అందుకు యేసుప్రభువారు, వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయ పడకుము అని యేసుప్రభువారు చెప్తున్నారు.

ప్రభునందు ప్రియులారా ఈ లోకంలో భయము లేని మానవులు ఎవరు ఉండరు, అందుకే  ఈరోజున యేసుప్రభువారు చెప్తున్నారు భయ పడకుము నమ్మికమాత్రముంచుము
ఎందుకు మానవులమైన మనకు ఈ భయము కలుగుతుందో, ఏయే సందర్భములలో ఈభయము కలుగుతుందో ఈరోజున ఈ భయమును గూర్చి ధ్యానిద్దాం.

1.మొదటిగా మానవులమైన మనకు ఎందుకు ఈ భయము కలుగుతుంది అని ఆలోచిస్తే

మానవులమైన మన జీవితంలో భయము అనేది ఈ లోకం అనేక మందికి అనేక విషయాలను, పరిస్థితులను చుస్తే భయం అనేది కలుగుతూ ఉంటుంది,  ఐతే మనిషిలో ఈ భయము అనేటటువంటిది గోరాతిగోరమైనటువంటిది, ఒక మనిషికి ఈ భయము అనేది దేనిని బట్టి వస్తుంది అని మనం ఆలోచిస్తే ఏదైనా సంఘటన, లేదా ఏదైనా వ్యాధిని బట్టి, లేదా సమస్యను బట్టి, ఆర్థికపరిస్థితిని బట్టి  మనకు భయం అనేది కలుగుతుంది.

2.మనకు భయము కలిగినపుడు ఎవరిని ఆశ్రయించువారిగా ఉండాలి అని ఆలోచిస్తే

కీర్తనలు56:3 నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్ర యించుచున్నాను. 

దేవుని నమ్మిక ఉంచేవారు భయపడరు, దేవుని యెడల విశ్వాసముంచేవారు భయపడరు,  యాయీరు కుమార్తె చనిపోతుందేమో అని భయపడుచుండగా అలాంటి సంధర్బములో యేసుప్రభువారు అంటున్నారు అతనితో భయపడకుము అని, అంటే మనకు ధైర్యము ఇచ్చేవాడు మన యేసయ్య, మనలను బలపరచేవాడు మన యేసయ్య, మనం దేనిని గూర్చి బయపడుతున్నామో దేవుని యెడల నమ్మిక ఉంచి ఆయనను ఆశ్రయించిన యెడల మనకు ధైర్యము కలుగుతుంది అని దేవుని వాక్యము చెప్తుంది, అందుకే మనం మనుష్యులను లక్ష్యపెట్టక మన యేసయ్య యందు విశ్వాసము ఉంచిన యెడల, మనకు కలిగిన ప్రతి భయము నుండి విడుదల కలిగించువాడు మనలను రక్షించువాడు ఆయనే.

3.భయపడుటవలన మనకు ఏమి కలుగుతుంది, మనకు భయము కలిగినపుడు ఏమిచేయాలి అని ఆలోచిస్తే
 
సామెతలు 29:25 భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును యెహోవాయందు నమి్మక యుంచువాడు సురక్షిత ముగా నుండును.

అది అనారోగ్యమువలన అవ్వచ్చు లేదా ఆర్థిక ఇబ్బందివలన భయము అవ్వచ్చు అది ఏదైనా మనం క్రుంగి పోయిన యెడల  మనకు బలహీనపడిపోతాము, అందుకే అటువంటి సమయంలో యెహోవాయందు నమి్మక ఉంచి, దేవుని ఆశ్రయించిన యెడల మనకు విడుదల కలుగుతుంది. యేసయ్య సమాజమందిరపు అధికారి యింటికి వచ్చిఆ చిన్నదాని చెయిపట్టి తలీతాకుమీ అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను;

కీర్తనల గ్రంథము 118:6
యెహోవా నా పక్షమున నున్నాడు నేను భయ పడను నరులు నాకేమి చేయగలరు?

మనకు భయము కలిగినపుడు మనకు దిగులు కలుగుతుంది, ఆందోళన పెరుగుతుంది, అలాంటి సందర్బములో మనం దేనిని చూసి భయపడక దేవుని యందు నమ్మిక ఉంచి ప్రార్ధనలో గడపాలి, దేవునిలో బలపడాలి అప్పుడు మనకు ధైర్యము కలుగుతుంది.

ఎవరు భయపడరు?
దేవుని నమ్మిక ఉంచేవారు భయపడరు, దేవుని యెడల విశ్వాసముంచే వారు భయపడరు. 
  
కీర్తనల గ్రంథము  46:1దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు 
2 కావున భూమి మార్పునొందినను నడిసముద్రములలో పర్వతములు మునిగినను
3 వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము.

మనకు భయము కలిగినపుడు మన యేసయ్యను ఆశ్రయించువారిగా మనం ఉండాలి దేవుని నమ్మిక ఉంచి ఆశ్రయించిన యెడల మనకు ధైర్యము ఇచ్చేవాడు,రక్షించువాడు మన శ్రమలలో నిందలలో అయన మనకు ధైర్యమునిస్తున్నాడు మన యేసయ్య.

మరియొక సంధర్బములో పాతనిభందనలో మోషే చనిపోయినపుడు యెహూషువా భయపడినట్లు బైబిల్ గ్రంధము చెప్తుంది.

మోషే చనిపోయినపుడు యెహూషువా ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అయన మోషే పడిన బాధలన్నీ చూసాడు నిందలన్నీ చూసాడు యెహూషువా ఇంతమంది ప్రజలను నేను నడిపించలేను, c భయపడినట్లు బైబిల్ గ్రంధము చెప్తుంది, అప్పుడు దేవుడు అతనిని బట్టి బయపడకు చెప్పినపుడు మోషే కంటే ధైర్యముగా, గొప్పగా వాడబడ్డాడు.

అందుకే మనం మనకు కలిగిన భయములో పిరికివారిగా, అవిశ్వాసులుగా ఈరోజున ఉండరాదు అని బైబిల్ గ్రంధము చెప్తుంది.
 
ప్రకటన గ్రంథము 21:8 పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
 
ఈరోజున భయ పడకుము నమ్మికమాత్రముంచుము మనకు కలిగిన భయములో దేవుని యందు మనం విశ్వాసం, నమ్మిక కలిగినవారంగా ఉండాలి అప్పుడు మన శ్రమలలో నిందలలో అయన మనకు ధైర్యము నిస్తాడు అట్టికృప యేసయ్య మన అందిస్తారు ఆమెన్

యేసయ్య  ఈ మాటలను  దీవించును  గాక ఆమెన్...



దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్...

************************************************************


 
20Jan2020ఆదివారం  ఆరాధన
గిడియన్ ఇంటర్నేషనల్ ఆదివారం 
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య గిడియన్ Rev.G.వర ప్రసాద్ గారు 

యిర్మీయా 18:1-9, 6 ఇశ్రాయేలువారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? యిదే యెహోవా వాక్కుజిగటమన్ను కుమ్మరిచేతిలొ ఉన్నట్టుగా ఇశ్రాయేలువారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. 
ఈరోజున నీవు నేను దేవుని ఎరిగిన బిడ్డలుగా, దేవుని కొరకు గొప్ప కార్యములు చేయడమే,మన ద్వారా గొప్ప కార్యాలు చేయబడాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం.

దానియేలు 11:32 అయితే తమ దేవుని నెరుగువారు బలముకలిగి గొప్ప కార్యములు చేసెదరు. 
  
ప్రియమైన వారలారా ఈరోజున దేవుడు తన యొక్క బిడ్డలా ద్వారా గొప్ప కార్యములు చేయాలనీ ఆశిస్తున్నాడు. యేసు ప్రభువారు ఈలోకానికి రాకుండా ఉంటే దేవుడు ఎవరో మనకు తెలిసి ఉండేదికాదు, నిజమైన దేవుడు ఎవరో మనం ఎరిగి ఉండటానికి కావలసిన  గొప్ప ధన్యత ఈరోజున మన అందరికి అయన ఇస్తున్నారు, అయన కేవలం యూదులకు  మాత్రమే  ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు  అయన ఈలోకంలో ఉన్నఅందరికి తమ  పోలికలో చేయబడ్డాo, కాబట్టి దేవుని చేత దీవించబడాలని ఆశీర్వదించబడ్డాలని  అబ్రాహామునకు ఇవ్వబడిన ఆశీర్వాదం మన అందరికి ఇవ్వడానికి యేసుప్రభువారు ఈలోకానికి వచ్చారు.


ఈరోజున మనం తెలుసుకోవలసినది ఏమిటి అని మనం ఆలోచిస్తే దేవుని ఎరిగినవారు ఎవరు? దేవుడి చిత్తం ఏమిటి? దేవుడు ఆ ఉద్దేశాన్ని ఎలా నెరవేరుస్తాడు?

1.మొదటిగా ఎవరు దేవుని ఎరిగినవారు, దేవుని చిత్తం ఏమిటి?

దేవుని ఎరగటం అని అంటే ఈరోజున మందిరమునకు తరచుగా వెళ్లేవారు, దేవుని కొరకు కానుకలిచ్చువారు కాదుగాని, దేవుని ఎరగటం అని అంటే దేవునితో నిజమైన సంభందం కలిగి ఉండటం, దేవుని రక్షణ తీసుకున్న తరువాత, మన పాపముల నుండి క్షమించినబడిన మన ఏసయ్యను మన సొంత రక్షకునిగా కలిగి ఉన్నప్పుడు మనకు దేవునితో సంభందం మొదలుఅవుతుంది, ఆతరువాత మనం ఆసంభందమును కొనసాగించవలసిన వారమైఉన్నము.

బైబిల్ గ్రంధములో మనం చుస్తే మోషే దేవునితో గొప్ప సంభందం కలిగినవాడుగా దేవుని మహిమను చూసినవాడుగా మనకు తెలుసు.

నిర్గమకాండము 33: 8 అతడుదయచేసి నీ మహిమను నాకు చూపుమనగా నా ముఖమును చూడజాలవు; ఏ నరుడును నన్ను చూచి బ్రదుకడనెను.
21 మరియు యెహోవాఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండమీద నిలువవలెను. నా వెనుక పార్శ్వమును చూచెదవు కాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను.

అదేవిధంగా అపొస్తలుడైన పౌలు భక్తుడు దేవుని స్వరం విని బైబిల్ గ్రంధములో అనేక పత్రికలు వ్రాసాడు  

దేవునితో సంభందం లిగి, దేవునిలో నిలిచి ఉంటేనే అయన కొరకు గొప్పకార్యములు చేయగలం.,అని మన యేసయ్య చెప్తున్నారు.
 
యోహాను  15: 4 నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలిం పరు.    

ఈరోజున నీవు నేను అయనతో కొనసాగకుండా ఆయనలో నిలిచి ఉండకుండా గొప్ప కార్యములు చేయలేము.

దేవుని కొరకు గొప్పకార్యములు చేయు వారీగా అయన యొక్క ఉద్దేశం నెరవేర్చుబిడ్డలుగా ఉండాలని నిత్యం మనం ఆయనకు ప్రార్ధించాలి.

దేవుని చిత్తం ఏమిటి అని మనం ఆలోచిస్తే 

తన బిడ్డలు గొప్ప కార్యములు చేస్తూ తన రక్షణలో ఉండాలి అనేది,అందరు మారు మనసు పొంది అయన రక్షణలో కొనసాగాలనేది దేవుని యొక్క చిత్తం.

బైబిల్ గ్రంధములో యెషయా ప్రవచిస్తున్నమాటలను మనం చుస్తే
యెషయా 64:8 యెహోవా, నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతిపనియై యున్నాము.

దేవునికి పనికొచ్చే పాత్రగా తయారుచేయడం అయన చిత్తం

2తిమోతి2:20 గొప్పయింటిలో వెండి పాత్రలును బంగారు పాత్రలును మాత్రమే గాక కఱ్ఱవియు మంటివియు కూడ ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింప బడును.

2.రెండవదిగా గొప్పకార్యములు చేయు తన బిడ్డలుగా ఎలా తయారుచేసుకుంటారు.

మొదటిగా అయన మనలను ఏర్పాటు చేసుకుంటారు.
1 కొరింథీ1 :29 ఎన్నికైనవారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్ని కలేనివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు.

కుమ్మరి కుండను తయారుచేయడానికి మట్టిని వెదకునట్లుగా దేవుడు తన ప్రణాలికను బట్టి మనలను అయన కొరకు వాడ బడే పాత్రగా మొదటిగా అయన మనలను ఏర్పాటుచేసుకుంటాడు.

రెండవదిగా అయన రక్షణ మార్గములోనికి నడిపిస్తారు.
కుమ్మరి ఆవిధంగా సేకరించిన మట్టిని ఇంటికి తీసుకువస్తాడు, దేవాది దేవుడు కూడా మనలను ఏర్పాటుచేసుకుని అయన రక్షణ ద్వారా నరకమార్గములో నుండి జీవపు మార్గములోనికి నడిపిస్తారు.

మూడవదిగా మనలను శుద్దీకరిస్తాడు.
మనలో ఉన్న పాపములను, లోపముల నుండి మనలను వేరుచేయడానికి దేవుని వాక్యము ద్వారా మనలను శుద్దీకరిస్తాడు, మనం ఎంతగా దేవుని వాక్యంలో బలంగా ఉంటామో అంతగా శుద్దీకరించబడతాము.

నాల్గవదిగా మన స్థితిని దేవుడు మారుస్తాడు.
కుమ్మరి ఆలాగున తీసుకువచ్చిన మట్టిని మంచి పాత్రగా చేయడానికి ఆ మట్టిని నలుగ గొట్టి మెత్తని స్థితిలోకి తీసుకువస్తాడు.., అదేవిధంగా ఆ దేవాది దేవుడు మనలను కూడా మనం ఏస్థితిలో ఉన్నామో అటువంటి స్థితి నుండి మెత్తని స్థితిలోకి దేవునికి పనికొచ్చే పాత్రగ్రా తయారుచేఉకోవడానికి మెత్తని స్థితిలోకి మారుస్తాడు, అప్పుడు దేవుని కొరకు గొప్ప కార్యములు చేయబడటానికి వాడబడతాము. 

ఈరోజున దేవుడు మన యెడల గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు, గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు., అయన మన ద్వారా గొప్ప కార్యములు చేయాలనీ ఆశిస్తున్నాడు. అటువంటి దేవుడు కోరే., దేవుడు వాడుకొనే పాత్రగా మనం అందరికిని అట్టి కృప మన యేసయ్య దయచేస్తారు ఆమెన్

యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్..



దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్...

**************************************************************



26Jan2020ఆదివారం  ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev. మానుకొండ ఆనందవరం గారు

అపొస్తలుల కార్యములు 28:1-6
5 అతడైతే ఆ విషజంతువును అగ్నిలో జాడించి వేసి, యే హానియు పొందలేదు.

చదవబడిన వాక్యభాగమును మనం చుస్తే అపొస్తలుడైన పౌలు గారు అనేకమైన ప్రాంతములలో దేవుని సువార్తను ప్రకటిస్తూవస్తు అనేక శ్రమలను భరించి వాటి నుండి తప్పించుకొనిన తరువాత మెలితే అను ద్వీపమునకు వచ్చెను., అక్కడ ఆ ద్వీపవాసులు పౌలు గారిని ఎంతగానో చేర్చుకొని ఉపచారము చేయుచుండగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పురాజబెట్టిరి, అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పులమీద వేయగా ఒక సర్పము వచ్చి అతని చెయ్యిపట్టెను, అప్పుడు ఆ ద్వీపవాసులు ఆసర్పము పౌలు గారి చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు; ఇతడు సముద్రమునుండి తప్పించుకొనినను న్యాయమాతనిని బ్రదుకనియ్యదని తమలో తాము చెప్పు కొనినట్లుగా వాక్యభాగములో మనం చూస్తున్నాం.

ఈ విధంగా జరిగిన సంఘటనను గూర్చి మనం ఆలోచిస్తే అనేకమైన ఆధ్యాత్మిక పాఠములను మనం నేర్చుకోవచ్చు, ఈ సందర్భములో ముఖ్యముగా కనిపిస్తున్నవి మూడు అవి అపొస్తలుడైన పౌలు గారు, ఒక సర్పము, అగ్నిలో పడవేయుట.

1.మొదటిగా పౌలు మోపెడు పుల్లలేరి నిప్పులమీద వేయగా ఒక సర్పము వచ్చి అతని చెయ్యిపట్టెను.

ఇక్కడ సర్పమును గూర్చి ఆధ్యాత్మికంగా మనం తెలుసుకోవలసినది ఏమిటి అని అంటే
సర్పము అనగానే మనకు గుర్తుకు వచ్చేది అది ఒక విషపు జంతువు, ప్రమాదకరమైనది అని, అంతే కాకుండా ఈ సర్పము శపించబడిన జీవితం కలిగినది, నీటిలో ముఖ్యముగా ఇరవైయేడు రకములైన ప్రమాదకరమైన సర్పములు కలవు.

ఈ సర్పము సాతానుకు సూచనగా ఉన్నది, ఎందుకు అని అంటే ఆత్మైన సాతాను సర్పములోనికి ప్రవేశించి ఏదెను వనములో నున్న ఆదామును అవ్వను ప్రేరేపించినట్లుగా మనకు తెలుసు., అందుకే మనం సాతానుకి అవకాశం ఇచ్చే సాతాను బిడ్డలుగా ఉండరాదు, సాతునుకి అవకాశం ఇస్తే మన క్రియలు మారిపోతాయి, మన హృదయం మోసకరంగా మారుతుంది, మన జీవితం శాపగ్రస్తమవుతుంది, అందుకే మనమైతే దేవుని అవకాశమిచ్చే దేవుని బిడ్డలుగా మంచి క్రియలు కలిగి ఉండాలి, మంచి హృదయం కలిగి ఉండాలి, మనం మంచి జీవితం కలిగి ఉండాలి.

పాతనిభందనలో మనం చుస్తే మోషే ఇత్తడి సర్పమును ఎత్తి నిలువబెట్టినపుడు, ఆ ఇత్తడి సర్పమును ఇశ్రాయేలీయులు చూచినపుడు వారు బ్రతికి నట్లుగా మనకు తెలుసు, ఎందుకు అని అంటే ఆ సర్పమును చూచినపుడు వారికీ దేవుని పట్ల చూపిన అవిధేయత వారికీ గుర్తుకు వచ్చి పశ్చత్తాపం కలిగి మార్పుచెందాలి అని దేవుని ఉద్దేశం.

ఈ సర్పము యొక్క లక్షణములను మనం గమనిస్తే.,

సామెతలు 23 :31 ద్రాక్షారసము మిక్కిలి ఎఱ్ఱబడగను గిన్నెలో తళతళలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము.
32 పిమ్మట అది సర్పమువలె కరచును కట్లపామువలె కాటువేయును.

ఈ సర్పము భయంకరమైనది దానిలోని విషం ద్వేషానికి సూచనగా ఉంది, ఈ సర్పము యొక్క లక్షణములను మనం గమనిస్తే అది కోపంతో కూడినది, గర్వం కలిగినటువంటిది, దేవుని బిడ్డలుగా మనం దేవుని పట్ల విధేయత కలిగి కోపమును విడిచిపెట్టేవారిగా మనం ఉండాలి, ద్వేషమును విడిచిపెట్టేవారిగా ఉండాలి.

సర్పము యొక్క లక్షణములను కలిగిన వారిని గూర్చి దేవుని వాక్యము ఏమి చెప్తుంది అని మనం చుస్తే
మత్తయి 12:34 సర్పసంతానమా, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా

పాపము, ద్వేషం, గర్వం అను చెడుఅలవాట్లు అనే విషం నుండి దూరంగా ఉంది మనం జీవితాలను సరిచేసుకోవాలి.

2.రెండవదిగా అపొస్తలుడైన పౌలు గారు ఆసర్పమును జాడించి అగ్నిలో పడవేసెను.


ఆధ్యాత్మికంగా ఎవరు ఈ అగ్ని అని మనం ఆలోచిస్తే దేవుడే దహించు అగ్ని అయి ఉన్నాడు అని మనకు తెలుసు, ఆ సర్పమును పౌలు గారు జాడించి అగ్నిలో పడవేయటమును మనం గమనిస్తే మనలో ఉన్న కోపం, ద్వేషం అనే చెడు అలవాట్లను అగ్నిలో వేయబడాలి, దహించివేయబడాలి.

దేవుని దగ్గర, దేవునికి సమీపంగా మన జీవితం ఉండాలి, దేవుని సన్నిధిలో మనం గోజాడితే సాతాను అనే విష సర్పము మన దరికిరాదు.

అందుకే మనం నిత్యం దేవుని ఆశ్రయించువారిగా ఉండాలి, దేవునితో ప్రార్ధనలో గడపాలి, దేవుని సన్నిధిలో దేవుని వాక్యమనే అగ్ని చేత కాల్చబడాలి, దేవుని యొక్క కృపను, ఆశీర్వాదాన్ని పొందుకోవాలి ని యేసయ్య కోరుచున్నారు అట్టి కృప మన అందరికి యేసయ్య ఇచ్చును గాక ఆమెన్.

యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.















 

 



















No comments: