October2019 Messages


13Oct2019ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు
Topic:క్రమం
 
మత్తయి సువార్త 7:21-23 ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.

23 అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయు వారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.

చదవబడిన వాక్యభాగములో యేసుప్రభువారు తన బిడ్డలైన వారికీ క్రమం నేర్పించాలని అనుకొనుచున్నారు., దేవుని బిడ్డలుగా మన కుటుంబజీవితంలో, మన యొక్క ప్రవర్తనలో, మరియు మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఒక క్రమం కలిగి ఉండాలి అని మన ప్రభువైన యేసు ప్రభువారు కోరుచున్నారు.
 
1.మొదటిగా మన జీవితంలో క్రమం కలిగి ఉండాలి అని అంటే ఏమిటి?


ఈ క్రమం అని అంటే ఒక వరుసలో చేసేటటువంటిది అని అర్ధం.
ఈ క్రమం మన జీవితంలో లేక పొతే మన జీవితం అంత గజిబిజిగా ఉంటుంది.
అనవసరమైనవి మన జివితంలో చేస్తే అది అక్రమం అవుతుంది, ఈ అక్రమానికి ఒక శిక్ష ఉంటుంది, అందుకే మనం చేసే ప్రతి పనిలో ఒక క్రమం కలిగి ఉండాలి.


2.మనం ఆధ్యాత్మికంగా ఏవిధమైన క్రమం కలిగి ఉండాలి.

మన ఆధ్యాత్మిక జీవితంలో మనం దేవుని సన్నిధికి సమయానికి రావటానికి ఒక క్రమం పాటించాలి, ఆరాధనకు సమయానికి రావాలి, ప్రార్ధన సమయానికి రావాలి.


3.ఆధ్యాత్మికంగా మన జీవితంలో క్రమం లేకపోతె ఏమి జరుగుంది అని యేసయ్య చెప్తున్నారు 
 
మత్తయి 7:21
21 ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.

ఆధ్యాత్మికంగా మన జీవితంలో క్రమం లేకపోతె ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, యేసయ్య తన తండ్రి  చిత్తప్రకారము చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును.అని యేసయ్య మనకు భోదిస్తున్నారు, అటువంటి శిక్షనుండి తొలగి పోవాలని అంటే మనo ఆధ్యాత్మికంగా మన జీవితంలో క్రమం కలిగి ఉండాలి.


4.దేవుని సన్నిధిలో క్రమం పాటిస్తే మనకు ఏమి కలుగుతుంది.


దేవుని సన్నిధిలో మనం క్రమం కలిగి ఉంటె, ఆధ్యాత్మిక జీవితంలో మనం క్రమం కలిగి ఉంటె దేవుని నుండి మనం ఏమి కోరుచున్నామో , అవి మనకు దేవుడు మనకు దయచేస్తాడు.


5.అక్రమం అని అంటే ఏమిటి, ఈ అక్రమం గూర్చి బైబిల్లో ఏమని వ్రాయబడినది.


మత్తయి7:22-23
 22 ఆ దినమందు అనేకులు నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు.
23 అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయు వారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.

తనది కానిది ఆక్రమించుకొనుటయే అక్రమం, తనది కానిది పొందుకొనుటయే అక్రమం.

ఈలాంటి అక్రమం చేయువారిని దేవుడు ఎరుగనని అంటున్నాడు, అయన సన్నిధి నుండి పొండని వారితో చెప్తున్నాడు.

అక్రమం చేయువారు త్రోవతప్పినవారుతో సమానం వారు పరలోకరాజ్యములో ప్రవేశింపరు అని యేసు ప్రభువారు చెప్తున్నట్లుగా మనం గమనించవచ్చు.

అందుకని మనం మన జీవితంలో క్రమం కలిగి ఉండాలి, మన ఆధ్యాత్మిక జీవితంలో క్రమం కలిగి ఉండాలి.


6.ఆధ్యాత్మిక క్రమం కలిగి ఉండటానికి మనం ఏమి చేయాలి, ఏమి కలిగి ఉండాలి.


దేవుని సన్నిధికి సమయం కేటాయించాలి, దేవుని సన్నిధికి త్వరపడి వెళ్ళాలి.
దేవుని ప్రార్ధనకై సమయం పాటించాలి, దేవుని ఇవ్వాల్సిన సమయంలో క్రమం పాటించాలి
దేవుని మందిరమునకు సమయానికి వెళ్ళాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి.

అందుకే యేసుప్రభువారు అంటున్నారు నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు.  అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయు వారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును అని అంటున్నారు.

అందుకే మనం మన జీవితంలో  క్రమం కలిగి నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధి మంతుని పోలియుండును అని యేసయ్య అంటున్నారు

అందుకే మనం మన జీవితంలో, మన కుటుంభంలో, మన ప్రవర్తనలో దేవుని వాక్యమనే బెత్తంతో భోదించబడాలి దేవుని సేవకుల ద్వారా హెచ్చరించబడాలి మన జీవితంలో సక్రమంగా ఉండాలి అని యేసయ్య కోరుచున్నారు.

దేవుని సన్నిధికి క్రమం కలిగి ఉండాలని, మన ఆధ్యాత్మిక స్థితిలో క్రమం కలిగి మన ప్రభువు చూపిన మార్గంలో నడవటానికి మన జీవితం సరిచేసుకోవాలని అట్టి కృప యేసయ్య మన అందరికి ఇవ్వాలని  ఆశిస్తూ.  


దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్..


యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్...
*********************************************************


20Oct2019ఆదివారము ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరంగారు
మత్తయి 5:48
48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.

చదవబడిన వాక్యభాగములో యేసుప్రభువారు మనము పరిపూర్ణముగా ఉండాలి అని కొండ మీద ప్రసంగిస్తున్న సమయంలో ఒక చక్కని మాటను మనకు చెప్తున్నారు, ఇది యేసయ్య చెప్పిన భోదలో మనకు ఇచ్చే ఒక హెచ్చరిక. 


పరిపూర్ణత అనే మాట చాల ప్రాముఖ్యత కలిగిన మాట, మన యేసయ్య పరిపూర్ణుడు, ఆయన పరిశుద్ధుడు, అయన పరిపూర్ణంగా పరిశుద్ధత కలిగినవాడు.

అందుకే యేసయ్య ఈ రోజున మనం కూడా పరిపూర్ణంగా పరిశుద్ధత కల్గిన వారంగా ఉండాలి అని కోరుచున్నారు.

ఈ రోజున మనం సంపూర్ణ పరిపూర్ణత అంటే ఏమిటో.,

అటువంటి పరిపూర్ణత కలిగి ఉండాలి అని అంటే మనం ఏమి కలిగి ఉండాలో.,

బైబిల్ గ్రంధములో ఈ పరిపూర్ణత కలిగి ఉండటానికి ఏమి లక్షణములు కలిగివుండాలో.,

యేసయ్య మనకు ఈ పరిపూర్ణత గూర్చి ఏమి చెప్తున్నారో ఈ రోజున మనం ధ్యానించుకుందాం.


1.మొదటిగా మనం దేవునితో సదాకాలం ఉండాలి అని అంటే మనం పరిశుద్ధతలో పరిపూర్ణత కలిగివుండాలి. 

2 కొరింథీ 7:1

1 ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తిచేసి కొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.

మనం పరిశుద్ధంగా ఉండాలి అని యేసుప్రభువారు మన కొరకు మనలను పరిపూర్ణులుగా మార్చడానికి ఈ లోకానికి వచ్చారు.

మనం చేసే చిన్న చిన్న తప్పులను పాపములను కూడా విడిచిపెట్టి అయన యొక్క సంపూర్ణ పరిశుద్ధతలోనికి మార్చబడాలి, యేసయ్య చెప్పిన ప్రతి మాటను నెరవేర్చువారిగా మనం ఉండాలి.

యేసయ్య దగ్గరకు ఒక పరిసయ్యుడు పరలోక రాజ్యం చేరడానికి ఏమిచేయాలి అని అడిగినపుడు అయన నిన్నువలె ని పొరుగు వానిని కూడా ప్రేమించాలి అని చెప్పారు అటువంటి పరిశుద్ధత కలిగి ఉంటేనే మనం పరలోక రాజ్యం  చేరుకుంటాము, మన పరలోకపు తండ్రి మన కొరకు పరిపూర్ణంగా వచ్చారు.

మనం పాపములను విడిచి, అయన రక్తములో మన పాపములు కడగబడి పరిపూర్ణులుగా మార్చబడాలి అని యేసయ్య చెప్తున్నారు.

మనం పరిపూర్ణులుగా లేకపోతె ఎవరికీ ఇవ్వవలసిన జీతం వారికీ ఇస్తాను, యేసయ్య అంటున్నారు.

ప్రకటన గ్రంథము 22:11-12

11 అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే యుండ నిమ్ము, నీతి మంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము.12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.


2.రెండవదిగా మనలో పరిపూర్ణమైన ప్రేమను కలిగి ఉండాలి.

1 యోహాను 4:18

ప్రేమలో భయముండదు; అంతేకాదు; పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును; భయము దండనతో కూడినది; భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు.

దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించి అట అద్వితీయ కుమారుని ఈ లోకమునకు పంపించాడు.

మనకు దేవుని యెడల పరిపూర్ణ మైన ప్రేమను కలిగి ఉండాలి, అప్పుడే మనం మన సమయాన్ని మన జీవితాన్ని దేవునికి ఇవ్వగలం.

మనమైతే దేవుని పట్ల, దేవుని సేవకుల పట్ల పరిపూర్ణమైన ప్రేమను కలిగి ఉండాలి. 

మనం సంఘము పట్ల పరిపూర్ణమైన ప్రేమను కలిగి ఉండాలి. 

కుటుంభం పట్ల, సమాజం పట్ల పరిపూర్ణమైన ప్రేమ కలిగి ఉండాలి.

భార్య-భర్త పట్ల, భర్త- భార్య పట్ల పరిపూర్ణమైన ప్రేమ కలిగి ఉండాలి.


ఎందుకు అని అంటే మనం పరిపూర్ణంగా ఉండాలి అని యేసయ్య తనను తాను అప్పగించుకున్నాడు.


3.మూడవదిగ మనం దేవుని యెడల పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండటంలో పరిపూర్ణత ఉండాలి.

యాకోబు2:22

విశ్వాసము అతని క్రియలతోకూడి కార్యసిద్ధి కలుగజేసెననియు, క్రియలమూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావుగదా?

మనకు సంపూర్ణ పరిపూర్ణత ఉండాలి అని అంటే మనం దేవుని యెడల పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి.

మన విశ్వాసంలో పరిపూర్ణత కావాలి అని అంటే మనం మంచి క్రియలు కలిగి ఉండాలి, క్రియలు లేని విశ్వాసం మృతమైనటువంటిది.

ఈ రోజున మనం ఎలా ఉన్నామో మన విశ్వాసంలో సంపూర్ణ పరిపూర్ణత కలిగి ఉన్నామా, లేక అసంపూర్ణ పరిపూర్ణత కలిగి ఉన్నామో మనలను మనం ఒక సారి పరిశీలించుకుని, సరిచేసుకోవాలి.


4.నాల్గవదిగా  మనం సంపూర్ణులుగా ఉండాలి అని అంటే మనం ఓర్పు కలిగి ఉండాలి.

యాకోబు 1:4

4 మీరు సంపూర్ణులును, అనూ నాంగులును,ఏ విషయములోనైనను కొదువలేనివారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి.

మన యేసయ్య ఓర్పు విషయంలో సహనం కలిగినవాడు, అయన కలిగి ఉన్న సహనం మనం కలిగి ఉండాలి.

అయన ఎంతమంది శారీరకంగా, మానసికంగా బాధపెట్టిన ఓర్పుతో సహనం కలిగిఉన్నాడు, అటువంటి ఓర్పు మనం కలిగి ఉంటె, మనకు యేసయ్య ఓర్పు తరువాత గొప్ప విజయమును మనకు ఇస్తాడు.


5.ఐదవదిగా మనం శ్రమలలో పరిపూర్ణత కలిగి ఉండాలి.

హెబ్రీయులకు 2:10

10 ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగు చున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూ ర్ణునిగా చేయుట ఆయనకు తగును.

శ్రమలో పరిపూర్ణత కలిగిన వాడు మన యేసయ్య, మానవ రక్షణకు పరిపూర్ణత కావాలి అని అంటే శ్రమల ద్వారానే మనం పరిపూర్ణతలోనికి తీసుకురాబడతాం, శ్రమల ద్వారానే మనకు రక్షణ, తద్వారా మనం దేవుని రాజ్యంలోకి చేర్చబడతాం.

మనం శ్రమలు పడాలి, ఆ శ్రమలను సహించుకొని, ఓర్చుకొని క్రీస్తు సంఘము కొరకు నిలబాడాలి, అప్పుడే మనం సంపూర్ణ పరిశుద్దులుగా పరిపూర్ణతలోనికి మార్చబాడతాం.

ఫిలిప్పీయులకు 1:29-30

29 ఏలయనగా మీరు నాయందు చూచినట్టియు, నాయందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగి యున్నందున
30 క్రీస్తునందు విశ్వాసముంచుటమాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను.

ఈ రోజున మనం పరిపూర్ణత చెందాలి అని అంటే శోధనలు శ్రమలు మనం సహించాలి.
 
మనం దేవునిలో పరిపూర్ణులుగా ఉండాలి అని అంటే మనం పరిశుద్దులుగా పవిత్రులుగా ఉండాలి.

ఒకరి పట్ల ఒకరు మరియు దేవుని పట్ల పరిపూర్ణమైన ప్రేమకలిగి ఉండాలి. 

మరియు మనం దేవుని యెడల విశ్వాసంలో పరిపూర్ణత కలిగి ఉండాలి.

మనం ఓర్పు కలిగి శ్రమలను సహించుకొని పరిపూర్ణులుగా మార్చబడాలి అని యేసయ్య కోరుచున్నారు.

యేసయ్య కృప మన అందరికి సదాకాలము తోడై ఉందును గాక ఆమెన్..
 

యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్..

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్..


**************************************************************


27Oct2019ఆదివారము ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు
అంశం :గిద్యోను

న్యాయాధిపతులు 7:19-23

20 అట్లు ఆ మూడు గుంపులవారు బూరలను ఊదుచు ఆ కుండలను పగులగొట్టి, యెడమచేతు లలో దివిటీలను కుడిచేతులలో ఊదుటకు బూరలను పట్టుకొనియెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలువేసిరి.

చదవబడిన వాఖ్యభాగములోని గిద్యోను దేవుని ప్రజలైన వారిని శత్రువుల బారినుండి ఏవిధంగా రక్షించుటకు దేవుని నుండి ఏమి కోరుచున్నాడో, దేవుడు అతనిని ఏమి చేయమన్నాడో మనకు వివరిస్తుంది.

ఈ గిద్యోను దేవుని ద్వారా సుచక క్రియలను అడగటం తద్వారా దేవుని యందు విశ్వాసం కలగటం, దేవుని  విశ్వసించటం ద్వారా తన ప్రజలను రక్షించుటకు శత్రువుల మీద యుద్దానికి పోవటం, దేవుడిచ్చిన ఆయుధములతో విజయమును సాధించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఎలా పొందాడో మనం తెలుసు కోవచ్చు.

1.మొదటిగా ఈ గిద్యోనును ఎవరో అని మనం ఆలోచిస్తే
 
ఈ గిద్యోను అనగా పడదోయువాడు అని అర్ధం, ఇతనికి ఉన్న మరియొక పేరు యెరుబ్బయలు, యితడు మనష్షే గోత్రమునకు చెందినవాడు, యోవాషు కుమారుడు.

దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులైన వారిని క్రమక్రమంగా ఆశీర్వదిస్తూ నాయకులైన మోషే, అహరోను ద్వారా నడిపిస్తున్నాడు. తరువాత అహరోను కోరిక మేరకు వందమందికి ఒకరిని నాయకులుగా నియమించి వారిని నడిపించారు, అటువంటి వారిలో విశ్వాసులకు పాత్రుడుగా దేవుని ప్రజలైన వారిని విజయంలోనికి నడిపించినవాడు ఈ గిద్యోను.
 

2.గిద్యోను దేవుని అడిగిన సుచక క్రియ, అదేవిధంగా దేవుడు చేసిన ఏ సుచక క్రియల వలన గిద్యోను యుద్దానికి సిద్ధపడ్డాడు మనం ఆలోచన చేస్తే

గిద్యోను దేవుని ప్రజలను రక్షించుటకు ముందు దేవుని ఒక సూచక క్రియను అడిగినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నాచేత ఇశ్రాయేలీయులను రక్షింప నుద్దేశించిన యెడల నేను కళ్లమున గొఱ్ఱబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరియుండగా ఆ గొఱ్ఱ బొచ్చుమీద మాత్రమే మంచుపడు నెడల నీవు సెల విచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించెదవని నేను నిశ్చయించుకొందునని దేవునితో అనెను, ఆలాగున జరిగెను; అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండువరకు ఆ బొచ్చునుండి మంచును పిండెను.

​అప్పుడు గిద్యోను ఇంకొక మారు ఆ బొచ్చుచేత మరియొక సూచక క్రియ దేవుని అడిగెను, అది నేల అంతటిమీద మంచు పడి యుండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు ఆలాగున చేసెను; నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చుమాత్రమే పొడిగానుండెను.

అప్పుడు గిద్యోను దేవుడు చిన్న వాటిని కూడా అద్భుత క్రియగా చేయ సమర్థుడని నమ్మి, దేవుని కోసం, దేవుని ప్రజలైన వారిని రక్షించుటకు యుద్దానికి సిద్ధపడ్డాడు.

3.ఈ గిద్యోనుకు తోడుగా శత్రువులతో యుద్ధమునకు తీసుకువెళ్లే వారిలో మూడువందల మందిని దేవుడు ఎన్నుకొన్న విధానము గూర్చి ఆలోచన చేస్తే 
 
ఈ గిద్యోనును దేవుని ప్రజలైన వారిని రక్షించుటకు యుద్దానికి సిద్ధపడిన తరువాత తన ప్రజలైన వారితో పలికిన మాటలను, దేవుడు వారిని ఉద్దేశించి గిద్యోనుతో పలికిన మాటలు
 
అప్పుడు యెహోవా ఎవడు భయపడి వణకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్లవలెనని జనులు వినునట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలోనుండి ఇరువది రెండువేలమంది తిరిగి వెళ్లి పోయిరి. 
కాగా పదివేలమంది నిలిచియుండగా యెహోవా నీళ్లయొద్దకు వారిని దిగజేయుము, అక్కడ నీకొరకు వారిని శోధించెదను అని గిద్యోనుతో సెల విచ్చెను.వారందరు నీళ్ల దగ్గర ఉన్నపుడు యెహోవా కుక్కగతుకునట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, త్రాగుటకుమోకాళ్లూని క్రుంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను.

చేతితో నోటికందించుకొని గతికినవారిలెక్క మూడు వందల మంది; మిగిలిన జనులందరు నీళ్లు త్రాగుటకు మోకాళ్లూని క్రుంగిరి. అప్పుడు యెహోవా గతికిన మూడు వందల మనుష్యుల ద్వారా మిమ్మును రక్షించెదను; మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను; జనులందరు తమ తమ చోట్లకు వెళ్లవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను.


4.ఈ రోజున మనం ఎలా ఉన్నాము దేవుని నుండి పారిపోయే వారీగా ఉంటున్నామా, లేదా దేవుని కొరకు నిలబడి దేవునికి పనికొచ్చే పాత్రగా ఉంటున్నామా 

ఇక్కడ మొదటి గుంపు శత్రునకు భయపడి పారిపోయారు,
రెండవ గుంపు కష్టపడలేని గుంపు,
మూడవ గుంపు చెప్పినది చేసే గుంపు,
ఇక్కడ మనం దేవుని కొరకు నిలబడి దేవుడు చెప్పినట్లుగా చేసే గుంపుగా ఉండాలి, అప్పుడు దేవుడు మనకు విజయమును అందిస్తాడు.

యేసుప్రభువారు అప్పగింపబడిన తరువాత అయన శిష్యులందరు శత్రువులకు భయపడి చెల్లాచెదురై పారిపోయారు, తరువాత యేసయ్య ద్వారా తిరిగి నడిపించబడ్డారు.

ఈ రోజున మనకు ఉన్న ప్రధాన శత్రువు సాతాను, ఈ సాతాను నిత్యమూ మనలను శోదిస్తూ ఉంటాడు, ఎప్పుడైతే మనం దేవుడిచ్చే సర్వాంగ కవచములు ధరించుకొని సమస్యలు, కష్టము వచ్చిన దైర్యముగా దేవుని కొరకు నిలబడే  క్రైస్తవ బిడ్డలుగా మనం ఉండాలి, అప్పుడు సాతాను వారిని వదిలి వెళ్ళిపోతాడు, అటువంటి వారిని దేవుడు ఆశీర్వదించి పైకి లేవనెత్తుతాడు



5.గిద్యోనుకు దేవుడిచ్చిన ఆయుధములను నుండి ఒక విశ్వాసి నేర్చుకోవలసిన వాటిని గూర్చి మనం ఆలోచిస్తే


గిద్యోను చేసిన యుద్ధంలో దేవుడిచ్చిన మూడు ఆయుధములు ఒక విశ్వాసికి ఉండవలసిన మూడు ఆయుధాలు.

ఈ గిద్యోను లెక్కకు మించి అన్ని వేలమంది శత్రువులను జయించుటకు దేవుడు ఇచ్చిన మూడు ఆయుధములను గూర్చి మనం తెలుసుకుందాము, అటువంటి ఆయుధములను దేవుడు మనము కలిగిఉండాలి అని సూచనగా మనకు తెలియజేస్తున్నాడు. 

న్యాయాధిపతులు 7:16 : ఆమూడువందలమందిని మూడు గుంపులుగా చేసి బూరను వట్టికుండను ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనెనునన్ను చూచి నేను చేయునట్లు చేయుడి;

@మొదటి ఆయుధం :-బూర
బూర  అనేది మనం దేవునికి చెల్లించే స్తుతికి సూచన, 

యెషయా పలికిన మాటలు గమనిస్తే
యెషయా58:1: తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియ జేయుము యాకోబు ఇంటివారికి వారి పాపములను తెలియ జేయుము.

ఇక్కడ తాళక అనగా ఆగకుండా అని అర్ధం, మనం కూడా ఆగకుండా దేవుని ఎలుగెత్తి మొరపెట్టు వారీగా ఉండాలి, ఎలుగెత్తి దేవుని స్తుతించాలి, ఎలుగెత్తి ప్రార్ధన చేయాలి ,అప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప విజయమును ఇస్తాడు.

సంఘము అత్యాశక్తితో ప్రార్ధించగా దేవుడు పేతురు సంకెళ్ళ నుండి విడిపించాడు.

హెబ్రీయులకు 11:30 : విశ్వాసమునుబట్టి యేడు దినములవరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను.
 
అంతే కాకుండా ఎరికో పెద్ద ప్రకారపు గోడలను వారు ఏడు దినములు దాని చుట్టూ బూర ఊదగా ఆ గోడలు కూలెను, అందుకే మనం దేవుని, మన ప్రార్ధన అనే బూరతో ఎలుగెత్తి చాటాలి, అప్పుడు దేవుడు మనకు విజయమును అందిస్తాడు.

@రెండవ ఆయుధం :-వట్టికుండ

కుండ మంటి ఘటమునకు సూచన

2 కొరింథీ 4:7:అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదైయుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. 

రోమ 12:1: కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.

గిద్యోను చెప్పినట్లుగా వారు ఎందుకు చేయలేక పోయారు అని అంటే వారి శరీరం సహకరించకపోయి ఉండవచ్చు.

ఈ రోజున మనం దేవుడు చెప్పినది మనం చేయలేక పోవుచున్నాము అని అంటే మన శరీరం సహకరించడం లేదు అని అర్ధం., 
ప్రక గ్రంధము 21:8 :అటువంటి వారిని దేవుడు అగ్ని గుండంలో పడవేస్తాను అని అంటున్నాడు
 
మానవులమైన మనం మంటివంటివారం, మనం దేవుని కొరకు శ్రమ పడాలి, మన శరీరాలు నలుగ గొట్టబడాలి, మన కోరికలను చంపుకొని దేవుని కొరకు మనలను మనం సజీవయాగముగా సమర్పించుకోవాలి.

@మూడవ ఆయుధం :-దివిటీ

ఈ దివిటీ మన ఆధ్యాత్మిక జీవితానికి సూచనగా ఉంది.
మన జీవితం దేవుని కొరకు వెలుగుగా ఉండాలి.

మనo వెలుగుగా ఎలా ఉండాలి?

బుద్ధిగల కన్యకలు వలే సిద్ధపాటు కలిగి ఉండాలి, మనం ఆరిపోయే దీపములవలె ఉండకూడదు, వెలుగు తున్న దివిటీలు వలే ఉండాలి , మన ఆధ్యాత్మికత అనే దివిటీ నిత్యం వెలుగుతూనే ఉండాలి, ఆత్మీయంగా ఫలించాలి. అప్పుడు దేవుడు గిద్యోనుకు ఇచ్చిన విజయాన్ని మనకు మన జీవితంలో ఇచ్చి ఆశీర్వదిస్తాడు.

అట్టి కృప మన అందరకు ఇచ్చి మన యేసయ్య మన అందరిని నడిపించును గాక ఆమెన్.


యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్.  


దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్  


************************************************************


















No comments: